జగన్‌ కల నెరవేరుతుందా? ప్రశాంత్‌ పాచికలు పారతాయా?

 

ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో జగన్‌ అలర్ట్‌ అయ్యారు. 2014లో స్వల్ప ఓట్ల తేడాతో అధికారానికి దూరమైన జగన్...ఈసారి ఎలాగైనా సీఎం పీఠం అధిష్టించాలని పావులు కదుపుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన ఆయుధంతో టీడీపీని చిత్తు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. వైసీపీ గెలుపు బాధ్యతల్ని ప్రశాంత్ కిషోర్ నెత్తిన పెట్టారు. ఇప్పటికే జగన్‌తో సమావేశమైన ప్రశాంత్‌ కిషోర్‌... ఏపీ రాజకీయాలపై చర్చించారు. జగన్‌తో పరిచయ కార్యక్రమం పూర్తికావడంతో... ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే ఏపీ‌లో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 

ప్రశాంత్ కిషోర్ 2014లో తన రాజకీయ వ్యూహాలతో మోడీని, తర్వాత బీహార్ లో నితీశ్ కుమార్ ని గద్దెనెక్కించి పేరు తెచ్చుకున్నారు. అప్పట్నుంచి పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ పేరు మార్మోగిపోయింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే యూపీలో ప్రశాంత్ పాచికలు పారకపోయినా...పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాయి. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించడం ఆసక్తి రేపుతోంది.

 

అధికార పార్టీలో అసంతృప్తుల్ని త‌మ వైపు తిప్పుకునేందుకు సూచ‌న‌లతో పాటు గెలుపు కోసం ప్రశాంత్ కీలకమైన సలహాలిస్తారని జగన్ నమ్ముతున్నారు. గ‌తంలో అనేకమంది విజయానికి బాటలు వేసిన ప్రశాంత్ కిషోర్ తననూ అధికారంలోకి తెస్తుందని జగన్ భావిస్తున్నారు.