వైకాపాకు తెలంగాణా ప్రజలు మళ్ళీ గుర్తుకొస్తున్నారే!

 

గత 16నెలల్లో ఏనాడూ కూడా తెరాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి పల్లెత్తు మాట అనడానికి ఇష్టపడని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారసభలో మొదటిరోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. గత గత 16నెలల్లో ఏనాడూ కూడా ప్రజా సమస్యలపై స్పందించని వైకాపా అధినేత జగన్ నిన్న ఒక్కరోజునే మొత్తం అన్ని సమస్యలను ఏకరువు పెట్టి, కేసీఆర్ ప్రభుత్వాన్ని కడిగేసారు. గత 16నెలల్లో తెలంగాణాలో వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కనీసం స్పందించని జగన్మోహన్ రెడ్డి, వరంగల్ జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

 

ఇన్నాళ్ళుగా తను స్పందించకపోయి ఉండవచ్చును. తెలంగాణాలో పరామర్శ యాత్రలు చేసిన షర్మిల కూడా స్పందించకపోయుండవచ్చును. కానీ కనీసం తెలంగాణాలో వైకాపా నేతలు కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడలేదు..కనీసం స్పందించలేదు. మరి వైకాపా అధినేత జగన్ కి ఇప్పుడు హటాత్తుగా తెలంగాణా ప్రజలు, వారి సమస్యలు గుర్తుకుచేసుకొని ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అంటే వైకాపా వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నందునే. కానీ ఏనాడూ ప్రజాసమస్యలపై స్పందించని వైకాపా ఈ ఎన్నికలలో ఎందుకు పోటీ చేస్తోంది? అంటే దానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1.తెరాస-వైకాపాల ఉమ్మడి శత్రువు తెదేపాకు నష్టం కలిగించడానికి. 2. తమ ఉమ్మడి శత్రువు అయిన చంద్రబాబుకి కేసీఆర్ దగ్గరవుతున్నరనే దుగ్ధతో కావచ్చును. ఈ రెండు కారణాలు కూడా పూర్తిగా పరస్పర విరుద్దమయినవే..జగన్ ఆలోచనల లాగ!

 

తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అవగాహన ఎవరికీ తెలియనిది కాదు. ఇంతకుముందు జరిగిన శాసనమండలి ఎన్నికలలో వైకాపా తెరాస అభ్యర్ధికి మద్దతు ఇచ్చింది. అది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధానికి చక్కగా అద్దం పట్టింది.ఏ ఎన్నికలలో అయినా ఎన్ని పార్టీలు పోటీ చేస్తే అంతగా ప్రజల ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉంటాయని అందరికీ తెలుసు. ఈ ఉప ఎన్నికలలో వైకాపా పోటీ చేయడానికి కారణం అదేనని చెప్పవచ్చును. తెరాస ఓట్లు తెరాసకు ఎలాగు పడతాయి కానీ మిగిలిన ఓట్లను ఎంతగా చీల్చగలిగితే అంత తెరాసకు లాభం చేకూరుతుంది. తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపా బలపరిచిన బీజేపీ అభ్యర్ధికి, కాంగ్రెస్ మరియు ఈ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న ఇతర పార్టీలకి అంత నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తెరాసపై యుద్ధం చేస్తూనే తెరాసకు పరోక్షంగా సహాయం పడుతున్నారని భావించవచ్చును.

 

ఇక అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం జరిగినప్పటి నుండి ఇంతవరకు కత్తులు దూసుకొంటున్న చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మిత్రులుగా మారడం లేదా మరే ప్రయత్నాలు చేస్తుండటం జగన్ జీర్ణించుకోవడం కష్టమే. ఒకవేళ కేసీఆర్ నిజంగానే చంద్రబాబు నాయుడుకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే అప్పుడు తెలంగాణా తన పార్టీ వైఖరి ఏవిధంగా ఉండబోతోందో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి తన ఎన్నికల ప్రచార సభలో రుచి చూపిస్తునట్లున్నారు. ఒకవేళ తేదేపాకు తెరాస దగ్గరయితే వైకాపా దూరం అవుతుందని జగన్ చాలా స్పష్టంగానే చెపుతున్నట్లుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఒకేసారి రెండు మూడు పిట్టలు కొట్టాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఎప్పుడూ అది బ్యాక్ ఫైర్ అవుతూనే ఉండటం విశేషమయితే, బ్యాక్ ఫైర్ అవుతున్నా కూడా పట్టువదలని విక్రమార్కుడులాగ మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తుండటం కేవలం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. ఈ ఉప ఎన్నికలలో వైకాపా పోటీ చేయడం తప్పో ఒప్పో మున్ముందు పరిణామాలను బట్టి తెలుసుకోవచ్చును.