చంద్రబాబుని ఫాలో అవుతున్న వైఎస్ జగన్.!!

చంద్రబాబుకి ముందుచూపు ఉన్న నేతగానే కాకుండా.. నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న నేతగా పేరుంది. పార్టీ నేతలైనా, ప్రజాప్రతినిధులైనా, ప్రభుత్వ అధికారులైనా ఆయనలాగే క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు కోరుకుంటారు. నిబద్ధత, క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అవసరమైతే సొంత పార్టీ నేతలకు క్లాసులు కూడా పీకుతారు. అంతెందుకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో కూడా ఆయన ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. ఎప్పటికప్పుడు నియోజక వర్గాల వారీగా తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. చిన్న తప్పులుంటే సూచలను ఇస్తారు. ఆ ఎమ్మెల్యే మీద ప్రజల్లో మరీ వ్యతిరేకత ఉంటే పద్ధతి మార్చుకో లేదంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టేస్తారు. అందుకే ఆయన హయాంలో ఇంచుమించు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. చంద్రబాబుకి స్వప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఆయన టిక్కెట్ల కేటాయింపు, అభివృద్ధి పనుల విషయంలో నిక్కచ్చగా ఉంటారు. దానికి తగ్గట్టే ఫలితాలు కూడా అందుకుంటారు. ఇదే ఇప్పుడు జగన్, చంద్రబాబుని ఫాలో అయ్యేలా చేసిందేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

 

జగన్, చంద్రబాబు అంటే ఒంటికాలి మీద లేస్తారు. ప్రతిపక్ష నేతగా అధికారపార్టీ నేతని విభేదించడం కామన్ లేండి. చంద్రబాబు మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఎలాగైనా ఓడించి సీఎం అవ్వాలని చూస్తున్న జగన్.. చంద్రబాబునే ఫాలో అవుతూ చంద్రబాబుని దెబ్బతీయాలని చూస్తున్నారట. మొన్నటివరకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు నమ్ముకున్న.. నియోజకవర్గాల వారీగా రిపోర్టులు, క్రమశిక్షణనే జగన్ కూడా నమ్ముకుంటున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ' పద్ధతి మార్చుకో.. లేదంటే నిన్ను మార్చి వేరే వారికి టిక్కెట్ ఇస్తాం' అని పెద్ద రాయుడు రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారట.

 

 

జగన్‌ ఓ వైపు పాదయాత్ర చేస్తూనే.. మధ్యలో విరామ సమయంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, సిట్టింగ్‌లతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశమై వారి బలాలు, బలహీనతలపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేలను చీపురుపల్లెకు పిలుపించుకొని రివ్యూ నిర్వహించారట. సర్వే బృందాలు కూడా సమీక్షలో ఉన్నాయి. ప్రతి ఒక్కరిని నీ బలహీనతలు ఇవి అంటూ బహిర్గత పరిచి సలహాలు, సూచనలు ఇచ్చారట. బలహీనతలు ఎక్కువ మోతాదులో ఉన్న వారిని ఉద్దేశించి మీ బలహీనతలను నెల రోజుల్లో సరిచేసుకుంటే సరి, లేకుంటే సీటు వేరే వారికి ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఒక ఇన్‌ఛార్జ్‌ని ఉద్దేశించి నీకు మాటలు ఎక్కువ, తిరుగుడు తక్కువ అని మందలిస్తూ ఇప్పటి నుంచైనా నియోజకవర్గ ప్రజలతో మమేకం కావాలని ఆగ్రహించినట్లు తెలుస్తోంది. అలాగే ఒక ఎమ్మెల్యేను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఎన్నికల సమీపిస్తున్నాయ్‌.. చురుగ్గా వ్యవహరించకపోతే ప్రత్యర్ధిని ఢీకొనడం కష్టమని సూచించినట్లు సమాచారం. అంతేకాదు ఆయా ఇన్‌చార్జ్‌ల, ఎమ్మెల్యేల తీరు నచ్చక నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలు ఎవరెవరు దూరంగా ఉంటున్నారో కూడా సర్వే నివేదిక ద్వారా వివరిస్తూ వారిని దగ్గరకు తీసుకునే చర్యలు వెంటనే చేపట్టాలని, గెలవాలంటే అహాన్ని వీడాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి జగన్ కూడా చంద్రబాబు స్టైల్ లో నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకొని ఫోకస్ చేస్తున్నారుగా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.