చంద్రబాబు బాటలో జగన్... వన్‌మ్యాన్‌ ఆర్మీలా పరిపాలన..!

చంద్రబాబు తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేయడం మొదలుపెట్టారట. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. విప్లవాత్మక నిర్ణయాలతో తాను దూసుకుపోతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు... తన స్పీడ్ ను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తంచేస్తున్నారట. అంతేకాదు తన అంచనాలు ఒకలా ఉంటే... మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మాత్రం మరోలా ఉందని జగన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. క్లిష్ట సమయాల్లో కీలక పరిస్థితుల్లో మంత్రులు చాకచక్యంగా వ్యవహరించలేకపోతున్నారని జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారంటూ మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమవుతున్నారని జగన్ ఫైరయ్యారట. ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే గొప్పగా మనమేం చేస్తున్నామో చెప్పుకోవడంలో ఇటు మంత్రులు... అటు ఎమ్మెల్యేలు వెనుకబడుతున్నారని జగన్ క్లాస్ పీకారట.

అయితే, జగన్ స్పీడ్‌ను తట్టుకోలేక మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, అంతే వేగంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నామని అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఉంటోందని చెబుతున్నారు. దాంతో ఒక్క సీఎం తప్పా...మిగతా వాళ్లెవరూ పనిచేయడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిందని, అదే సమయంలో పరిపాలన మొత్తం జగన్ వన్‌మ్యాన్‌ ఆర్మీలా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే, ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.