ఉగ్రవాదులకు మనం ఎటువంటి సంకేతాలు పంపుతున్నాము?
posted on Jul 30, 2015 12:06PM
యాకుబ్ మీమన్ ముస్లిం అయినందునే అతనిని ఉరి తీస్తున్నారని కొందరు వితండవాదం చేసారు. చివరికి సల్మాన్ ఖాన్ వంటి వ్యక్తి కూడా అతనిని సమర్దిస్తూ ట్వీట్ చేసాడు. కానీ యాకుబ్ మీమన్ 257 మంది ప్రజల మరణానికి, 650 మంది గాయపడటానికి కారకుడనే విషయం విస్మరించడం విస్మయం కలిగిస్తోంది. సుమారు దశాబ్దంపాటు సాగిన సుదీర్ఘమయిన న్యాయవిచారణలో అతను దోషిగా దృవీకరించిన తరువాతనే అతని కోర్టులు మరణశిక్ష వేసాయి. అన్నేళ్లపాటు కోర్టులో న్యాయపోరాటం చేయగలిగిన అతనికి అన్యాయం జరిగిందని వాదించడం అర్ధరహితమే. అసలు అతనికి అన్నేళ్లపాటు పోరాడేందుకు అవకాశం కల్పించడం ద్వారానే అతని పట్ల మన న్యాయవ్యవస్థలు ఎటువంటి వివక్ష చూపలేదని స్పష్టం అవుతోంది.
అతనికి అండగా నిలబడ్డవారు న్యాయం కోరుతూ మళ్ళీ నిన్న అర్దరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెల్లవారు జామున 3.00-4.30 గంటల వరకు సుప్రీం త్రిసభ్య ధర్మాసనం వారి వాదనలను వింది. అటువంటప్పుడు అతనికి అన్యాయం జరిగిందని ఏవిధంగా అనగలరు. సుప్రీంకోర్టు అతనికి మరణ శిక్ష ఖరారు చేసిన తరువాత, రాష్ట్రపతి అతని క్షమాభ్క్ష పిటిషన్ని తిరస్కరించిన తరువాత కూడా మళ్ళీ అతని కేసుని సుప్రీం కోర్టు రెండుసార్లు పునర్విచారించింది. మళ్ళీ రాష్ట్రపతి అతని క్షమాభిక్ష పిటిషన్ని పునః పరిశీలించారు. సుప్రీం ధర్మాసనం, రాష్ట్రపతి రెండవసారి కూడా అతనికి ఈ కేసులో మరణశిక్షకి అర్హుడేనని భావించిన తరువాతనే అతనికి మరణ శిక్ష అమలుచేసారు.
నిజానికి భారత పౌరులను బలిగొన్న ఒక నేరస్తుడు ఈకేసు కోసం భారత రాష్ట్రపతిని అర్దరాత్రి వరకు, సుప్రీంకోర్టుని తెల్లవారుజాము వరకు కూడా పనిచేయించగలిగాడంటే అతను ఎంత శక్తివంతుడో, అతనికి ఎంత అంగబలం, అర్ధబలం, పలుకుబడి ఉందో స్పష్టమవుతోంది. అటువంటి శిక్షలు పడిన సాధారణ ఖైదీలెవ్వరికీ ఇటువంటివి సాధ్యం కాదు. కానీ యాకుబ్ మీమన్ వెనుక అసాధారణమయిన బలం, చాలా పలుకుబడి గల శక్తులు ఉన్నందునే అతను చివరి నిమిషం వరకు న్యాయపోరాటం చేయగలిగాడని స్పష్టం అవుతోంది.
కానీ మన న్యాయస్థానాలు ఎంతటి ఉగ్రవాదికయినా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేందుకే చివరి వరకు అన్ని అవకాశాలు కల్పిస్తే దానినే మన మేధావులు తప్పుపడుతున్నారు. అతని తరపున అంతపోరాటం జరిగిన తరువాత కూడా అతనిని ఉరి తీయడం అన్యాయం అని అంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. అతనిని ఉరి తీసిన తరువాత కూడా అతనివల్ల భారత్ చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్దపడవలసివస్తోంది అంటే భారత వ్యతిరేక శక్తులు దేశంలో ఎంతగా వ్రేళ్ళూనుకొని ఉన్నాయో అర్ధమవుతోంది.
భారతదేశంపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని భారత ప్రభుత్వం, మన న్యాయవ్యవస్థలు ఉగ్రవాదులకు బలమయిన సందేశం ఇవ్వాలని భావిస్తే, అటువంటి ఉగ్రవాదులను విద్యావంతులు, మనవ హక్కుల సంఘాల నేతలు, న్యాయవాదులు, మత పెద్దలు, రాజకీయనాయకులు సమర్ధించడం ఉగ్రవాదులకు మరింత దైర్యం కల్పిస్తోంది. తమకు భారత్ లో మద్దతు ఇచ్చేవారు చాలా మందే ఉన్నారని, కనుక భారత్ పై దాడులు చేసేందుకు ఏ మాత్రం సంకోచించనవసరంలేదని వారు భావించేలా చేస్తోంది.
మొన్న పంజాబ్ లో పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని చంపారు. అంతకంటే ముందుగా వారు పఠాన్ కోట్ రైల్వే ట్రాక్ పై ఐదు బాంబులు కూడా అమర్చారు. ఒకవేళ అవి ప్రేలి ఉంటే వందలాది మంది ప్రయాణికులు మరణించేవారు. అటువంటి చర్యలను ఖండించడానికి మన మేధావులు, మత పెద్దలు, మనవ హక్కుల సంఘాలు ముందుకు రావు. కానీ ఉగ్రవాదులు ఎవరయినా పట్టుబడి ఈవిధంగా ఉరిశిక్షకు గురయితే మాత్రం చాలా ఆందోళనపడిపోతారు. తమ శక్తి యుక్తులన్నిటినీ వినియోగించి అటువంటి వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు కూడా పోరాడుతారు. అందుకు అవసరమయితే మన రాష్ట్రపతిని, న్యాయవ్యవస్థలను కూడా రేయింబవళ్ళు పనిచేయించగల సమర్ధులు. ఈ విదంగా వ్యవహరిస్తూ మన దేశంపై దాడులు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఉగ్రవాదులకు ఇంతకీ మనం ఏమి చెప్పదలచుకొన్నాము? అని అందరూ ఆలోచించవలసిన సమయమిది.