పీఎం మోదీకి అదిరిపోయే కౌంటరిచ్చిన మాల్యా!!

 

ప్రధాని మోదీపై లిక్కర్ డాన్ విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేసారు. పరోక్షంగా తనను ప్రస్తావిస్తూ ప్రధాని లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలకు ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి నిజంగా ప్రజా నిధులను వసూలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే.. తాను చెల్లిస్తానని చెప్పిన డబ్బు తీసుకోవాలని భారత బ్యాంకులను ఎందుకు ఆదేశించడం లేదంటూ ప్రశ్నించారు. కింగ్ ఫిషర్ తరపున బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నీ తిరిగి చెల్లించేస్తానంటూ మరోసారి ట్విటర్లో ఇవాళ ఆయన వరుస పోస్టులు పెట్టారు.

ప్రధాని మోదీ బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. ఓ వ్యక్తి రూ. 9వేల కోట్లతో పారిపోయారంటూ విజయ్ మాల్యా గురించి పరోక్షంగా ప్రస్తావించారు. దీంతో మాల్యా ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం విన్నా. ఆయన అనర్గళంగా మాట్లాడతారని నాకు తెలుసు. రూ.9 వేల కోట్లతో ఓ వ్యక్తి పరారయ్యాడు అంటూ ప్రధాని తన ప్రసంగంలో పేరు చెప్పకుండా ప్రస్తావించారు. మీడియా చెబుతున్న దాన్ని బట్టి అది నా గురించేనని నాకర్థమైంది. అయితే ఈ సందర్భంగా ఆయనను ఓ విషయం అడుగుతున్నా.. నిజంగా ఈ ప్రజాధనాన్ని వసూలు చేయాలని ఉంటే.. తాను చెల్లిస్తానన్న డబ్బును తీసుకోవాలని ప్రధాని మోదీ తన బ్యాంకులను ఎందుకు ఆదేశించట్లేదు? అలా చేస్తే కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన ప్రజా ధనాన్ని పూర్తిగా రికవరీ చేసుకున్నాం అని అయినా చెప్పుకోవచ్చు కదా’ అని మాల్యా ట్విటర్‌లో పేర్కొన్నారు.

‘కర్ణాటక హైకోర్టు ముందుకు నేను సెటిల్మెంట్‌ ఆఫర్‌తో వచ్చాను. అది పనికిమాలిన ఆఫర్‌ అని కొట్టిపారేయొద్దు. నేను నిజాయతీగానే ముందుకొచ్చాను. కానీ కింగ్‌ఫిషర్‌కు ఇచ్చిన రుణాలను బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదు?’ అని ప్రశ్నించారు. తాను అక్రమంగా ఆస్తులు దాచుకున్నట్టు ఈడీ చెబుతున్న విషయం మీడియా ద్వారా తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురయ్యానని మాల్యా  అన్నారు. ‘ఒకవేళ దాచిన సొమ్ము అంటూ ఏదైనా ఉంటే రూ.14 వేల కోట్ల ఆస్తులను నేను బహిరంగంగా కోర్టు ముందు ఎందుకు పెడతాను? ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. అయినా నాకిది పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించలేదు.’ అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.