ప్రత్యర్థితో లాలూచీ.. సిద్ధాంతాలు, విధి విధానాలతో పనిలేదు.. అధికారమే ముఖ్యం

 

ఈమధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు తీరును పరిశీలిస్తే సామాన్యులందరికి పలు సందేహాలు కలుగుతున్నాయి. తమ పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా పోరాడిన వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలు పరుగులు పెడుతున్నాయి. అధికారం అనే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలు దత్తత తీసుకున్నాయి. ఫలితంగా ఓటర్లకు ఏ భావజాలను చెప్పి ఆకర్షించారో.. అందుకు భిన్నమైన అభిప్రాయాలున్న పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు వాళ్లు చేస్తే మేము చేయడం తప్పా అని ఎదురుదాడితో తమ వాదనను సమర్థించుకుంటున్నారు. 

కొన్నాళ్ల క్రితం కశ్మీర్ లో బీజేపీ,పీడీపీ తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీది వేర్పాటువాద భావజాలం, బీజేపీది కరుడు గట్టిన జాతీయవాదం. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్ గా మారిపోయింది. శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని బిజెపి ప్రశ్నిస్తే కశ్మీర్ అంశాన్ని సమాధానంగా చెబుతోంది. ఒక్క కశ్మీర్ మరో మహారాష్ట్ర మాత్రమే కాదు, ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసి ఒకరి పై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసి ప్రజా తీర్పు అంటూ కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేసిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అలా చూస్తే భావజాలం సిద్ధాంతాలు అన్ని ఓటర్లను మభ్య పెట్టటానికేనని అర్థమవుతుంది. చివరికి అంతిమ సూత్రం అధికారమే అవుతుంది. 

ప్రతిపక్షంలో వుండడానికి ఏ ఒక్క పార్టీ కూడా సిద్ధపడటం లేదు.ఆ ఆలోచనే వారిని అసహనానికి గురిచేస్తోంది. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలు ఏది లెక్కలోకి రావడం లేదు. గతంలో అధికార పార్టీతో సమానంగా ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత ఉండేది. కానీ రానురాను రాజకీయం ఓ వైపు మగ్గిపోతోంది. అధికార పార్టీ అంటే తిరుగులేని రాజ్యాధికారాన్ని అనుభవించమని నయా పాలకులు నేర్చుకున్నారు. ఫలితంగా ప్రతిపక్షంలో ఉండటం నేతలకు నచ్చడం లేదు. అందుకే అధికారం అందుకనే సమీకరణాలూ ఏ పార్టీతో సరిపోతాయో లెక్కలేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా సుస్థిరంగా లేకపోయింది. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు కళ్ళముందు కదలాడుతుండగానే మధ్యప్రదేశ్ లో సింధియా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో తిరుగులేని మెజారిటీ ఉన్న వైసిపి సర్కార్ కూడా నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. 

పార్టీలు మారడం అనేది చొక్కా మార్చినంత సులువుగా తయారైంది. ఫిరాయింపు నిరోధక చట్టాలు తెచ్చినా పార్టీలే తమ కోసం కొన్ని లూప్ హోల్స్ ఉంచుకున్నాయి. దాంతో ఆ చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ఆ చట్టాలు తెచ్చిన పార్టీలే బాధితులుగా మారుతున్నాయి. బాధితులైన పార్టీలు అధికారంలోకి వచ్చాక దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేయడం లేదు. తాము ఆ లూప్ హోల్స్ నుంచి లబ్ధి పొందకూడదా అనే ధోరణిలో ఆపరేషన్ లు చేసుకుంటున్నాయి. దాంతో పార్టీ ఫిరాయించే వారికి ఏ ఆటంకం లేకుండా పోయింది. విపక్షంలో ఉండటమే అసహనంగా భావించే పరిస్థితి రావడానికి అసలు కారణం ఏమిటి.. అధికారం అండతో ప్రభుత్వాల్ని మార్చేసే ప్రజా తీర్పుకు అర్థం ఏముంటుంది.. ఈ పరిస్థితులు మారాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి.