ఏడాది క్రితమే సెక్షన్ 8 పై చంద్రబాబు లేఖ

నోటుకు ఓటు కేసు ఎన్నో మలుపులు తిరిగి ఆఖరికి సెక్షన్ 8 అమలు వరకూ వచ్చింది. ఇదే విషయం పై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం సెక్షన్ 8 అమలుకు ససేమిరా వద్దంటే, ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు అవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సెక్షన్ 8 అమలు గురించి గవర్నర్ ఎప్పుడో కేంద్రాన్ని సంప్రదించి తన బాధ్యతలు గురించి అడుగగా కేంద్రం కూడా కొన్ని ప్రత్యేక భాద్యతలను గవర్నర్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సెక్షన్ 8 అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర విభజన తరువాత.. సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల భద్రత నిమిత్తం సెక్షన్ 8 అమలు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాసినట్టు రాజకీయ విశ్లేషకుల వెల్లడి.

 

అయితే ఈ లేఖపై అప్పట్లో కేంద్రం కూడా స్పందించి హైదరాబాద్ లో ఉన్న భద్రతా వ్యవస్థపై కొన్ని ప్రత్యేకమైన భాద్యతలను గవర్నర్ కు అప్పగించింది. శాంతి భద్రతలకు సంబంధించిన ఏ నివేదిక అయిన పోలీసు అధికారులు గవర్నర్ కు అప్పగించాలని.. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానిపై నివేదిక కోరే, విచారణకు ఆదేశించే హక్కు, చర్య తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉంటాయని.. బాధితుల హక్కుల రక్షణ కోసం ఆయన అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు’’ అని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి స్పందించి గవర్నర్ కు విస్తృత అధికారాలు ఇవ్వాలనడం సరికాదని... ఒకవేళ గవర్నర్‌ తన అధికారాలను వినియోగించుకోవాల్సి వచ్చినా, తెలంగాణ కేబినెట్‌ సలహా మేరకే నడచుకోవాలి కేంద్రానికి లేఖ రాశారు. దీంతో అదే సమయంలో ‘‘గవర్నర్‌ విధులు, భాధ్యతలు, అధికారాలు (ఫంక్షనాలిటీస్‌)’’ మీద సవివరమైన నోట్‌ ఒకటి తయారు చేసి, గవర్నర్‌ వ్యక్తిగత అవగాహన కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు తెలుస్తోంది.

 

కేంద్రం పంపిన నోట్ ఆధారంగానే నోటుకు ఓటు కేసు వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ అభిప్రాయం కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఈ కేసు వల్ల వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయని.. ఈ గొడవల వల్ల నగరంలో శాంతి భద్రతలు చెడిపోయే అవకాశం ఉందని.. సెక్షన్‌ -8 ప్రకారం ఈ కేసు దర్యాప్తును నేను నేరుగా (తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా) పర్యవేక్షించవచ్చా? అందుకోసం నోటిఫికేషన్‌ ఇవ్వవచ్చా? అని ఏజీని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఏజీ కూడా గవర్నర్‌ తన విచక్షణ మేరకు నోటిషికేషన్‌ జారీ చేయవచ్చని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

 

కాకపోతే ఎప్పుడో సెక్షన్ 8 పై గవర్నర్ కు అధికారాలు ఇచ్చినా అప్పుడు అంత ఆందోళనకరమైన సమస్యలేవీ లేవు కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ నోటుకు ఓటు కేసు ఉదంతం బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు సెక్షన్ 8 అవసరం ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సెక్షన్ 8 అమలు అనేది కొత్తగా ఇప్పుడే తెరపైకి వచ్చినట్టు రాద్ధాంతం చేస్తుంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే తమకు ఎక్కడ నష్టం కలుగుతుందో అని తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు కాకుండా చూడటానికి తెగ ప్రయత్నిస్తుంది.