చంద్రబాబు వాయిస్‌ టెస్ట్ ఛాన్సే లేదు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓటుకు నోటు వ్యవహారంలో వాయిస్ టెస్ట్ నిర్వహించే ఛాన్సే లేనట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడి మీద దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న రెండు మీడియా సంస్థలు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వబోతున్నారని, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వాయిస్ టెస్ట్ నిర్వహించబోతున్నారని ఊదరగొడుతున్నప్పటికీ అంత సీను లేనట్టు సమాచారం. చంద్రబాబు నాయుడికి ఎలాంటి వాయిస్ టెస్ట్ నిర్వహించరాదని, ఆయనకు నోటీసులు జారీ చేయడం లాంటి పనులు చేయొద్దని ఇప్పటికే ‘పైనుంచి’ స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి స్థానంలో వున్న చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం అది కొరివితో తల గోక్కున్నట్టు అవుతుందని హెచ్చరికలు తెలంగాణ ప్రభుత్వ వర్గాలకు వచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తీవ్ర మల్లగుల్లాలు, చర్చలు, సందేహాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు వాయిస్ అంటూ టేపులు బయటకు విడుదల చేయడమే తమ తలకు తాచుపాములా చుట్టుకున్న నేపథ్యంలో నోటీసులు కూడా ఇస్తే అది మరిన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం వుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అసలు వాయిస్ టెస్ట్ అనేది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదట. ఒక వ్యక్తి ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా మాట్లాడే అవకాశం వుంది. ఇప్పుడు టెస్టులు నిర్వహించి ‘‘ఇది చంద్రబాబు వాయిస్సే’’ అని స్పష్టంగా చెప్పే ఛాన్సు కూడా లేదట. అలాంటప్పుడు అనవసరంగా టెస్టులు నిర్వహించి లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కోవడం ఎందుకన్న ఉద్దేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వున్నాయట. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు బలహీనమైపోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.