తెరాస చెవిలో వీ బ్రదర్స్ గులాబీ పువ్వు

 

పెద్దపల్లి ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ మళ్ళీ తమ సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరిన ఈ "వీ" సోదరులు ..తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు వేరే పార్టీలో ఉండడం ఎందుకు దండగ అని సెలవిస్తున్నారు. అయితే మొదట్నించీ వివేక్, వినోద్ లను తెరాస నేతలు దూరంగానే ఉంచారని సమాచారం. ఎప్పటికైనా కాంగ్రెస్ గూటికి చేరే పక్షులే అని వీ బ్రదర్స్ ను అనుమానించిన గులాబీ బాస్ పార్టీలో వీరికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణా భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు తెలంగాణా వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీయార్ .. ఇప్పుడు మాట మార్చి తెలంగాణా పునర్ నిర్మాణం తనతోనే సాద్యమంటున్నారు. ఇక తెరాసలో ఉంటే తమకు ఎటువంటి ముఖ్య పదవులు దక్కవని భావించిన వీ బ్రదర్స్ సొంత గూటికి చేరుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

వివేక్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఎంపీ మందా జగన్నాధం కూడా కారు దిగి కాంగ్రెస్ అభయ హస్తం అందుకోనున్నాడని తెలుస్తోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు కూడా. ఎంపీ వివేక్ కాంగ్రెస్ లో చేరడంపై ఈటెల స్పందిస్తూ..వివేక్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లినా టీఆర్ఎస్ పై ప్రభావం ఉండన్నారు.