విటమిన్‌ డి ఎక్కువవుతోంది

 

మనకి ఏది వచ్చినా పట్టడం కష్టం. ఫలానా ధెరపీ మంచిదనో, ఫలానా ఆహారం తినిచూడండి అనో ఓ వార్త రాగానే... దానిని అల్లుకుని వందలాది వార్తలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. మనం కూడా వాటికి అనుగుణంగానే ప్రవర్తించేస్తుంటాం. ఏం చేస్తాం! ఆరోగ్యం గురించి అవగాహనతో పాటుగా తొందరపాటు కూడా సహజమేనేమో! బహుశా అందుకేనేమో విటమిన్‌ డి ప్రాముఖ్యత గురించి వార్తలు వినిపించగానే కొంతమంది ముందూవెనుకా ఆలోచించకుండా డి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం మొదలుపెట్టారు. వైద్యులు ఇష్టపడకపోయినా అడిగి మరీ రాయించుకుంటున్నారు. కానీ ఇదేమంత శుభపరిణామం కాదంటున్నారు నిపుణులు.

 

ఎందుకీ విటమిన్ డి:

విటమిన్‌ డి గురించి ఒకప్పుడు పెద్దగా తెలియదు. శరీరంలోకి చేరిన కాల్షియం సరిగా ఒంటపట్టాలంటే విటమిన్ డి అవసరం అన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ఈమధ్య మన శరీరానికి విటమిన్‌ డి ఎంత అవసరమో చెబుతూ, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పరిశోధన వెలుగుచూస్తూనే వస్తోంది. ఈ పరిశోధనల ప్రకారం మెదడు ఎదుగుదలలో లోపాల దగ్గర్నుంచీ షుగర్‌ వ్యాధి వరకు, ఎన్నో సమస్యలు రాకుండా డి విటమిన్‌ తోడ్పడుతుంది. ఇక కాల్షియం లోపం వల్ల ఏర్పడే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు త్వరగా దరిచేరకుండా విటమిన్‌ డి అడ్డుకొంటుందని నమ్ముతున్నారు.

 

అదనంగా ఎందుకు:

మన శరీరానికి విటమిన్‌ డిని అందించే ప్రధాన వనరు సూర్యకాంతి. ఎందుకంటే ఆహారపదార్థాల ద్వారా విటమిన్ డి లభించే శాతం చాలా తక్కువ. అందుకనే ఈ మధ్య కాలంలో నూనె, పాలు, పళ్లరసాలు వంటి ఉత్పత్తులకు విటమిన్‌ డిని కృత్రిమంగా జోడించి మరీ విక్రయిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో మనం బయట తిరిగేది తక్కువ కాబట్టి, శరీరానికి అందవలసినదానికంటే తక్కువ విటమిన్‌ డి అందుతోందేమో అన్న అనుమానం ప్రతివారిలోనూ మొదలైంది. ఆ ఆనుమానమే అవసరం లేకపోయినా విటమిన్ డి తీసుకునే అలవాటుని కల్పిస్తోంది.

 

ఎంత అవసరం!

చాలామంది రోజుకి 1000 IUల విటమిన్‌ డి మన శరీరానికి అవసరం అనుకుంటారు. కానీ 2010లో సరిచేసిన పరిమితుల ప్రకారం 70 ఏళ్లలోపువారికి 600 IUలు, 70 ఏళ్లు దాటినవారికి 800 IUల విటమిన్‌ డి అందితే సరిపోతుంది. దీనికి ఓ 200 IUలు తగ్గినా కూడా పెద్ద ప్రమాదం లేదని చెబుతున్నారు. కీళ్లవ్యాధులు వంటి సమస్యలు ఉన్నవారు తప్ప ప్రత్యేకించి విటమిన్ డిను మందుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ అటు వైద్యులు ఇటు రోగులు కూడా డి విటమిన్‌ను తీసుకునేందుకు ఉబలాట పడుతున్నారు.

 

దుష్ప్రభావాలు లేకపోలేదు:

అవసరానికి మించి విటమిన్ డి మన శరీరంలోకి చేరితే చిన్నాచితకా దుష్ప్రభావాలు లేకపోలేవంటున్నారు. నీరసం, నిద్రలేమి, తలనొప్పి, అజీర్ణం, వికారం వంటి తాత్కాలిక సమస్యలు ఎలాగూ ఉంటాయట. వీటితో పాటుగా డి విటమిన్‌ వల్ల శరీరంలో అధికంగా కాల్షియం పేరుకుపోవడంతో రక్తనాళాలు గడ్డకట్టడం దగ్గర్నుంచీ కిడ్నీలు దెబ్బతినడం వరకూ రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక గర్భవతులు, పాలిచ్చే తల్లులు అధికంగా డి విటమిన్‌ తీసుకోవడం వల్ల వారి శిశువుకి హానిజరిగే ప్రమాదం ఉందంటున్నారు. అందుకనే ఆటకాయితనంగా విటమిన్ డి జోలికి పోవద్దని సూచిస్తున్నారు. ముందుగా వైద్యుల సలహా సంప్రదింపుల మేరకే మనకు డి విటమిన్‌ అవసరం ఉందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ సూర్యకాంతిలో కాసేపు తిరగడం వల్ల అది అదుపులోకి వస్తుందేమో ప్రయత్నించాలి. ఆ తరువాతే సప్లిమెంట్ల జోలికి పోవాలి.

 

- నిర్జర.