విజయవాడ స్కూల్ లో మద్యం తాగి దొరికిన గర్ల్స్

 

విజయవాడ ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక సంఘటన చూస్తుంటే.. ఇక నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు స్కూళ్ళు, కాలేజీల్లో కూడా నిర్వహించేలేమో అనిపిస్తోంది. విజయవాడ శివారులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రోజూ మద్యం తాగి స్కూలుకు వస్తున్న విషయం తెలిసి ఉపాధ్యాయులు ఖంగుతిన్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు కొద్ది రోజులుగా కూల్ డ్రింక్ లో మద్యం కలిపిన సీసాలతో స్కూల్ కి వస్తున్నారు. చున్నీ చాటున ఎవరికీ కనపడకుండా కొద్దికొద్దిగా తాగుతున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో తాగారు. పక్కన కూర్చున్న తోటి విద్యార్థినులపై తూలడం, నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. వారి నుంచి మద్యం తాగిన వాసన వస్తుండటంతో తోటి విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు వైద్య నిపుణులతో మద్యం పరీక్ష చేయించారు. బాలికలు మద్యం తాగినట్లు తేలడంతో ఖంగుతిన్నారు. తల్లిదండ్రులను పిలిపించి, విద్యార్థులతోపాటు వారికీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా.. ‘విద్యార్థినులు మద్యం తాగి తరగతికి రావడం వాస్తవమే. వీరిద్దరూ గతంలో చదువుకున్న పాఠశాలలోనూ ఇదే పని చేయడంతో టీసీలు ఇచ్చినట్లు తెలిసింది. తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో.. సీసాలో మిగిలిన దాన్ని తాగడం కారణంగా బాలికలకు అలవాటై ఉంటుందని భావిస్తున్నా. తోటి విద్యార్థులు పాడైపోతారని కుటుంబసభ్యుల సమక్షంలోనే వారికి టీసీలు ఇచ్చా’ అని వివరించారు.