బెజవాడలో "రెంట్" మంటలు...!
posted on May 27, 2016 12:31PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో అద్దెలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఫైరయ్యారు. ప్రజలపై అద్దెల భారం పెంచి ఇబ్బంది పెడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తన పాలనను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పటి నుంచి పలు సందర్భాల్లో రాజధాని వాసులకు అద్దెపై ప్రేమ ఎక్కువని దానిని వీడాలని చెప్పుకుంటూ వచ్చారు. విజయవాడ వాసులది సంకుచిత మనస్తత్వమని..వీరు ప్రపంచమంతా వెళ్లి వ్యాపారాలు చేస్తుంటారు. కానీ సొంత ప్రాంతం వచ్చేసరికి సంకుచితంగా ఆలోచిస్తారని సాక్షాత్తూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ, గుంటూరు ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలను వెతుక్కోవద్దని హితవు పలికారు. చిన్న చిన్న స్వార్థాలను వదులుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. అయినా ఇక్కడి ప్రజల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం..సచివాలయ ఉద్యోగులు విజయవాడ వచ్చేందుకు అద్దెను కారణంగా చూపుతుండటంతో సీఎం "రెంట్‌పై" ఫోకస్ చేశారు.
బెజవాడలో ఈ పరిస్థితి ఇప్పుటికిప్పుడు వచ్చింది కాదు. రాష్ట్ర విభజనకు పూర్వం నుంచే రాజకీయ, విద్యా, వైద్య, సాంస్కృతిక, వాణిజ్య, రవాణా రంగాలకు బెజవాడ కేంద్రం. నిత్యం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వివిధ వ్యాపారాల నిమిత్తం తరలివస్తుంటారు. వన్‌టౌన్‌లో వస్త్ర, బంగారం, బెనిటిక్స్ తదితర వ్యాపారం బాగా జరుగుతుంది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉపాధి నిమిత్తం బెజవాడ బాట పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వసతి నిమిత్తం అద్దె ఇళ్లే శరణ్యం. మొదట్లో కాస్త తక్కువగానే ఉన్న అద్దెలు రియల్ బూమ్ పెరగడం, అద్దెను వ్యాపార కోణంలో చూడటంతో కాలక్రమేణా పెరుగుతూ వచ్చాయి. అప్పట్లో ఒక కుటుంబానికి అద్దె ఇళ్లు కావాలంటే కనీసం రూ.6 వేల నుంచి 10 వేలను నెల అద్దెగా చెల్లించుకోవాలి.
కాని రాష్ట్ర విభజన జరగడం..అమరావతిని రాజధానిగా..విజయవాడను తాత్కాలిక రాజధానిగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో నవ్యాంధ్రలో బెజవాడ, గుంటూరులు కీలక నగరాలుగా మారడంతో అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఒక జాతీయ సంస్థ సర్వే ప్రకారం ఈ రెండు నగరాల్లో అద్దెలు కనీసం 25 వేల నుంచి 30 వేల వరకు పెరిగిపోయాయి. దీనికి తోడు ఇంటిపన్ను, నీటిపన్ను, కరెంట్ చార్జ్ అదనం. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 27లోగా ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అయితే హైదరాబాద్‌ను వదులుకోవడానికి సిద్ధపడ్డ ఉద్యోగస్తులకు విజయవాడ అద్దెలు వణికిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో అద్దెలు, హైదరాబాద్‌లో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలను మించిపోయాయని సాక్షాత్తూ ఏపీ సర్కార్ నియమించిన కమిటీ ప్రభుత్వానికి తెలిపింది.
రాజధానికి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధి వరకూ సింగిల్ బెడ్ రూం రూ.15 వేలు, డబుల్ బెడ్‌రూం రూ.18 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఉన్నాయని ఈ కమిటీ గుర్తించింది. ఒకవేళ ప్రభుత్వమే కల్పించుకుని ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూన్ 27 సమీపిస్తుండటంతో ఉద్యోగుల తరలింపు, వసతి, ప్రభుత్వ కార్యాలయాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. దీనిలో అద్దె అంశం వచ్చింది..గతంతో పోలిస్తే అద్దెలు విపరీతంగా పెరిగాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆయన అగ్గిమీద గుగ్గులమయ్యారు. ఇకపై దీనిని ఉపేక్షించేది లేదని అద్దెనియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరి సీఎం చర్యలు విజయవాడ, గుంటూరుల్లో అద్దెలు తగ్గించగలుగుతాయా..? బాబు ఆవేదనను ప్రజలు అర్థం చేసుకుంటారా..?