చంద్రయాన్-2 ప్రయోగం ఆ రోజు చేసుంటే విజయవంతం అయ్యేది!!

 

చంద్రయాన్-2 ప్రయోగం విజయం కోసం యావత్ దేశం ఎదురుచూసింది. అయితే చివరి నిమిషంలో సిగ్నల్స్ కట్ అవ్వడంతో ప్రయోగం విజయానికి అడుగు దూరంలో ఆగిపోయింది. అయినా శాస్త్రవేత్తలు నిరాశ చెందకుండా విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. దేశమంతా కూడా శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. 

చంద్రయాన్-2 సాంకేతిక సమస్యల వల్లే విజయవంతం కాలేదని మనం అనుకుంటున్నాం కానీ.. అసలు కారణం వేరే ఉందట. ఆరెస్సెస్ మాజీ కార్యకర్త, శివ్ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్ సంస్థ అధినేత సంభాజీ భిడే.. అసలు ప్రయోగం విజయం సాధించాలంటే ఏం చేయాలో, ఏ రోజు చెయ్యాలో చెప్పారు. చంద్రుడిపైకి తమ వ్యోమనౌకను పంపేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు 39వ సారి ఫలించాయని చెప్పిన సంభాజీ భిడే.. వారి మూన్ మిషన్ విజయవంతం కావడానికి కారణం ఏకాదశి రోజున ప్రయోగాన్ని చేపట్టడమేనని తెలిపారు.

చంద్రుడిని చేరుకోవాలని అమెరికా చేసిన ప్రయత్నాలు 38 సార్లు విఫలమయ్యాయని, ఇన్ని సార్లు విఫలమైన తర్వాత ఓ అమెరికన్ శాస్త్రవేత్త కీలక సూచన చేశారని తెలిపారు. ఆ సూచన ఏంటంటే మనం పాటిస్తున్న సిస్టమ్ ను వదిలేసి, కాలాన్ని లెక్కించేందుకు భారత్ ఉపయోగించే విధానాన్ని అనుసరిద్దామని చెప్పారని అన్నారు. ఆ తర్వాత చేపట్టిన ప్రయోగంలో అమెరికా స్పేస్ క్రాఫ్ట్ విజయవంతమైందని తెలిపారు. ఏకాదశి రోజున ప్రయోగాన్ని చేపట్టడమే వారి విజయ రహస్యమని సంభాజీ భిడే అన్నారు.