శివసేన 16-ఎన్సీపీ 15-కాంగ్రెస్ 13... ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరే ప్రమాణం

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్‌లో జరగనున్న ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందు డిసెంబర్ ఒకటిన ప్రమాణం చేయాలనుకున్నా, గవర్నర్ సూచన మేరకు ఈరోజే(నవంబర్ 28)న ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇక, ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది. అలాగే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను కూడా ఆహ్వానించామని... వాళ్లు కూడా ఉద్ధవ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరవుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే, తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ... ఆత్మహత్య చేసుకున్న 400మంది రైతుల కుటుంబాలను ఉద్ధవ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే, ఎంఎన్‌‌ఎస్ అధినేత రాజ్‌ఠాక్రే‌కు కూడా ఆహ్వానం పంపారు.

ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవంతో సంకీర్ణ సర్కారు కొలువుతీరుతుండగా, పదవుల పంపకంపైనా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. శివసేనకు ముఖ్యమంత్రి పదవితోపాటు 15మంది పదవులు దక్కనున్నాయి. ఇక, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రితోపాటు 13 కేబినెట్‌ బెర్త్‌లు... అలాగే కాంగ్రెస్‌కు స్పీకర్‌తోపాటు 13మంత్రి పదవులు లభించేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఉద్ధవ్ తోపాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు మాత్రమే ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై అవగాహనకు వచ్చాక డిసెంబర్ మూడున కేబినెట్ విస్తరణ ఉంటుందని కూటమి నేతలు తెలిపారు.