టీవీ9 బద్రి దుర్మరణం
posted on Feb 8, 2015 12:12PM

టీవీ9 న్యూస్ ప్రెజెంటర్ బద్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన వయసు 40 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో బద్రి భార్య లక్ష్మీ సుజాత, ఇద్దరు కుమారులు సాయి, సాత్విక్, బంధువు తారక్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి జరిగిన బంధువుల వివాహానికి కుటుంబ సమేతంగా హాజరైన బద్రి తిరిగి తన స్వగ్రామం నల్లచర్ల మండలం ఆవుపాడుకు వస్తుండగా ద్వారకా తిరుమల సమీపంలోని లక్ష్మీనగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బద్రి డ్రైవ్ చేస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మరణించారు. బద్రి పూర్తి పేరు కాళ్ళ వీరభద్రరావు. బద్రి దుర్మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.