టీఆర్ఎస్ ఖతమ్

 

తెలంగాణలో భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఖతమ్ అవుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖతమ్ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారని, నిజానికి తెలంగాణలో ఖతమ్ కాబోతున్న పార్టీ టీఆర్ఎస్సేనని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాజకీయంగా పతనం కావడం ఖాయమని, కేసీఆర్ ప్రభుత్వ పునాదులు కదిలిపోవడం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేటర్ల ఎమ్మెల్సీ ఎన్నికలే అందుకు ఉదాహరణ అని అన్నారు. తమకు వచ్చిన ఆఖరి అవకాశం ద్వారా అందినకాడికి దండుకునే పనిలో టీఆర్ఎస్ నాయకులు వున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, శవరాజకీయాలు చేసిన కేసీఆర్‌ని తెలంగాణ ప్రజలే తిప్పికొట్టడానికి సన్నద్ధమవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల కుంభకోణాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. టీఆర్ఎస్‌కి సత్తా వుంటే టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి మళ్ళీ గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.