టిఆర్ఎస్ లో ఓనర్లు, కిరాయిదార్లు అందరిదీ అదే బాట!!

 

గత డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కేసీఆర్ కొద్ది మంది మంత్రులతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత వచ్చే స్థానిక సంస్థల, లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వారికి తగిన గుర్తింపునిస్తూ తరువాత జరిగే మంత్రి వర్గ విస్తరణ లో స్థానం కల్పిస్తానని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా రెండు రోజుల క్రితం మంత్రి వర్గాన్ని విస్తరించడంతో ఇన్నాళ్ళు మినిష్టర్ బెర్త్ పైన ఆశ పెట్టుకున్న ఆశావహులు ఒక్క సారిగా పార్టీ అధినేత పై ఓపెన్ గా దాడి మొదలు పెట్టారు.

ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిష్టానం పైన ఏదయినా అసంతృప్తి ఉన్నా కేసీఆర్ సార్ ను కలిసి తమ గోడును చెప్పుకుని మీ ఇష్టం సార్ అని ఊరుకునే వాళ్ళు. కానీ రాష్ట్రం లో తాజాగా బీజేపీ బలపడడంతో, అలాగే ఆ పార్టీ టిఆర్ఎస్ ను గట్టిగా టార్గెట్ చేస్తున్న నేపధ్యం లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిష్టానం పై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణ ఉద్యమానికి అలాగే టిఆర్ఎస్ జెండాకు ఓనర్లం మేమే అంటున్న నాయిని, రసమయి బాలకిషన్, పద్మా దేవేందర్ వంటి నాయకులే కాకుండా వారు ఎవరినైతే కిరాయిదార్లు అంటున్నారో ఆ నేతలలో కూడా అసమ్మతి బయట పడింది. ఈ లిస్ట్ లో తాజాగా ఎమ్మెల్యేలు గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, జోగు రామన్న, మాధవరం కృష్ణ రావు వంటి వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్. నిన్నటి వరకు నోరెత్తి మాట్లాడని ఈ నాయకులను బుజ్జగించడానికి నిన్నటి వరకు పక్కన పెట్టిన హరీష్ రావే దిక్కవుతారా అని పొలిటికల్ విశ్లేషకుల అంచనా.