నేటి నుండి సాగర్ లో తెరాస శిక్షణా తరగతులు

 

ఈరోజు నుండి మూడు రోజుల పాటు నాగార్జున సాగర్ జలవిహార్ భవన్ లో తెరాస శిక్షణా తరగతులు నిర్వహించ బడతాయి. వీటికి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తో సహా పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు హాజరయి పార్టీ శ్రేణులకు వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు ఈ సమావేశాలలో వివరించి, వారి ద్వారా వాటి గురించి ప్రజలలో విస్తృతంగా ప్రజలలో ప్రచారం చేసుకొని ప్రజలకు మరింత చేరువ కావాలని తెరాస భావిస్తోంది.

 

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు ఎంత బలంగా ఉన్నప్పటికీ, పార్టీని గెలిపించుకోవడానికి కేసీఆర్ తో సహా పార్టీ నేతలందరూ చాలా తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి ఏ సెంటిమెంటు పనిచేసే అవకాశం ఉండకపోవచ్చును. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఎన్నికలలో ప్రధానాంశాలుగా మారవచ్చును. రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు కూడా బలపడేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కనుక వాటి నుండి మళ్ళీ గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటి నుండే తెరాస పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

 

నిన్న మొన్నటి వరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు తెరాస పీక మీద కత్తిలా వ్రేలాడాయి. హైకోర్టు పుణ్యమాని అవి డిశంబర్ కి వాయిదా పడ్డాయి. అయితే డిశంబర్ కూడా ఎంతో దూరం లేదనే సంగతి తెరాసకు కూడా తెలుసు. ఈలోగానే పార్టీ శ్రేణులను ఆ ఎన్నికలకు కూడా సమాయత్తం చేయవలసి ఉంటుంది. కనుక ఇటువంటి శిక్షణా తరగతులు నిర్వహణ తెరాసకు అత్యావశ్యకమేనని భావించవచ్చును.