పొరుగు రాష్ట్రాలలోకి విస్తరించనున్న తెదేపా

 

తెదేపాను జాతీయపార్టీగా మలిచే ప్రయత్నాలలో భాగంగా పొరుగు రాష్ట్రాలయిన తమిళనాడు, కర్నాటక, ఒడిషా, మహారాష్ట్రాలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించాలని తెదేపా నిశ్చయించుకొంది. వాటితో బాటు తెలుగువారు అధికంగా ఉండే అండమాన్ ,నికోబార్ దీవులలో కూడా పార్టీని వ్యాపింపజేయాలని నిశ్చయించుకొంది. పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించాలంటే కనీసం నాలుగు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు సంపాదించవలసి ఉంటుంది. కనుక ఇప్పటి నుండే ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పార్టీని విస్తరించుకోవాలని పార్టీ నిర్ణయించుకొంది. ముందుగా ఈ నెల 10వ తేదీన చెన్నై, బెంగళూరు నగరాలలో, 14వ తేదీన అండమాన్ ,నికోబార్ దీవులలో కూడా తెదేపా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ మూడు ప్రాంతాలలో నెలరోజుల పాటు సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో 3 లక్షల మందిని, అండమాన్, నికోబార్ దీవులలో లక్షమంది సభ్యులను చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకొంది. ఇంతకు ముందు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో కలిపి 50 లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్చిన నారా లోకేష్, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలలో నిర్వహించబోయే ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా స్వయంగా పర్యవేక్షిస్తారు. అందుకోసం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో, ఆయా రాష్ట్రాలలో తెదేపా అభిమానులతో నిన్న సమావేశమయ్యి తగిన ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు. కర్నాటకలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను అనంతపూర్ జిల్లాకు చెందిన తెదేపా నేతలు పరిటాల సునీత, పార్ధసారధి, కాల్వ శ్రీనివాసులు తదితరులకు అప్పగించారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు చిత్తూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు, యం. సుగుణమ్మ తదితరులు చూస్తారు. అండమాన్ నికోబార్ దీవులలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు ఎక్కువగా స్థిరపడి ఉన్నందున శ్రీకాకుళానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షిస్తారు.