తెదేపాయే తెరాసకు ఆదర్శం!
posted on Apr 11, 2015 10:04AM
అధికార తెరాస పార్టీ నేతలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం ఆ పార్టీనే ఆదర్శంగా తీసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెదేపా సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఇన్స్యూరెన్స్ పధకాన్ని జోడించడం ద్వారా రెండు రాష్ట్రాలలో కలిపి యాబై లక్షలమందికి పైగా కొత్త సభ్యులను పార్టీలోకి చేర్చుకోగలిగింది. దానికి వచ్చిన ఆ అనూహ్య స్పందన చూసి తెరాస పార్టీ కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయం కల్పించి మంచి ఫలితాలు రాబట్టగలిగింది. అందుకోసం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అదికారులకు నిన్న రూ. 4,64,21,200 రూపాయల చెక్కును అందచేశారు.
తెరాసలో మొత్తం ఏభై లక్షల మంది సభ్యులు ఉండగా వారిలో ప్రస్తుతం నలబై ఒక్క లక్షల మందికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షల రూపాయల చొప్పున బీమా సదుపాయం లభిస్తుంది. మిగిలిన వారికి కూడా త్వరలోనే భీమా సదుపాయం కల్పించబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇంతవరకు రాజకీయ పార్టీలన్నీ కార్యకర్తల చేత సేవలు చేయించుకొన్నాయే తప్ప ఏనాడు వారి యోగక్షేమాల గురించి ఆలోచించలేదు. కానీ తెదేపా యువనేత నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసారు. వారికి ఇన్స్యూరెన్స్ కవరేజి కల్పించారు. వారికి పార్టీ తరపున సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశః మున్ముందు మిగిలిన రాజకీయపార్టీలు కూడా ఆయన చూపిన మార్గంలో నడుస్తాయేమో?