రక్తమోడిన అమెరికా
posted on Jun 13, 2016 11:15AM
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం. ఫ్లోరిడాలోని ఒర్లాండో నగరంలో పల్స్ అనే ఓ నైట్ క్లబ్. స్వలింగ సంపర్కులకు పెట్టింది పేరైనా ఆ నైట్ క్లబ్‌లో శని, ఆదివారాలను ఒక్కటిగా ఆస్వాదించేందుకు చేరిన 300 మందికి పైగా యువత. ఒక పక్క సంగీతపు హోరుకి చెవులు దిమ్మెక్కిపోతున్నాయి. మరో పక్క మద్యంతో మనసు మత్తెక్కిపోతోంది. శనివారం అర్థరాత్రి రెండు గంటలు దాటిన తరువాత ఏదో మందుగుండు పేలిన శబ్దం. అది కూడా సంగీతంలో ఒక భాగమే అనుకున్నారు కానీ మృత్యు ఘంటికలకు ఎవరూ గ్రహించనేలేదు. కళ్లముందే ఒకో శరీరం విగతంగా పడిపోతున్నాక కానీ తామనుకున్న స్వర్గం కాస్తా నరకానికి దారితీయబోతోందని తెలియలేదు. అమెరికా చరిత్రలోనే అతి దారుణమైన కాల్పుల సంఘటనకు వారంతా సాక్షులుగా మిగిలిపోయారు.
అమెరికాలో ఎవరో ఒకరు ఇలా విచక్షణారహితంగా కాల్పులు జరపడం కొత్తేమీ కాదు. గత ఏడాది ఇలాగే కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులలో 14 మంది మరణించడంతో, తుపాకులకు సంబంధించిన చట్టాలను మరింత కఠినతరం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న తుపాకి సంస్కృతి గురించి ఒబామా కంటితడి పెట్టినా, చట్టానికి పదునుపెట్టినా... పరిస్థితిలో మాత్రం పెనుమార్పులేవీ రాలేదు. అమెరికాలో లక్షలకొద్దీ తుపాకులు ఎప్పుడెప్పుడా అని విరుచుకుపడేందుకు ఇంకా సిద్ధంగానే ఉన్నాయి. చట్టబద్ధంగా కావచ్చు, మరో విధంగా కావచ్చు... ఇంట్లో తుపాకీ ఉండటం అనేది అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది. ఒత్తిడికి లోనయ్యో, భార్యాభర్తలు గొడవపడో, మార్కులు సరిగ్గా రాలేదన్న ఉక్రోషంతోనో... ఇలా ఏ చిన్న వేదనతోనైనా తుపాకీని తీసుకుని వీధిలోకి వచ్చేస్తున్నారు పౌరులు. జనం మీదకి ట్రిగర్ నొక్కి మనసులోని కసిని చల్లార్చుకుంటున్నారు.
ఇలాంటి తుపాకీ సంస్కృతికి ఇప్పుడు మతద్వేషం కూడా తోడైంది. ఒర్లాండో క్లబ్‌లో కాల్పులు జరిపింది ఒమర్ మతీన్ అనే ఓ యువకుడనీ, అతను ISIS ఉగ్రవాద సంస్థ అంటే సానుభూతిపరుడనీ ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఒమర్ తండ్రి మాత్రం తన కొడుకు ఉగ్రవాది కాడని చెబుతున్నారు. స్వలింగ సంపర్కం అంటే మతీన్‌కు చిరాకు అనీ, అందుకనే ఈ చర్యకు పాల్పడి ఉంటాడనీ చెప్పుకొస్తున్నారు. అలా చూసినా ఒమర్ సనాతన భావజాలంతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు తేలుతోంది. తన మతానికీ, సంప్రదాయానికీ, అభిప్రాయాలకు వ్యతిరేకంగా తుపాకిని చేపడుతున్న సంస్కృతికి, ఒమర్ నిదర్శనంగా నిలిచినట్లయ్యింది. ఒమర్ తల్లిదండ్రులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు వలస వచ్చినవారు. తీవ్రవాదం వల్ల తన మాతృభూమి ఎలా విచ్ఛినమైందో చూసినప్పుడైనా ఒమర్ తుపాకీని చేపట్టకుండా ఉండాల్సింది.
ఒర్లాండో కాల్పులను, అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన నరమేధంగా భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్, అమెరికా అధ్యక్షులు ఇరువురూ కూడా ఈ చర్యను ద్వేషపూరితమైనదిగా ఖండించారు. ఒమర్ తూటాలకు బలైన 50 మందికి ప్రపంచమంతా తన నివాళులను అర్పించింది. అమెరికా రక్షణ దళాలు త్వరగా ప్రతిస్పందించడంతో క్లబ్‌లోని మిగతా వ్యక్తులు సురక్షితంగా బయటపడగలిగారు. రక్షణ దళాల ఎదురుకాల్పులకు ఒమర్ నిలువలేకపోయాడు. కానీ ఒమర్ చావుతో ఈ సమస్య తీరలేదు సరికదా, మరింత జటిలం కానుంది. ఒమర్ చర్య ఇటు ISIS ఉగ్రవాదులకు మరింత నైతిక స్థైర్యాన్ని అందించనుంది. ఇప్పటికే ISIS ఈ చర్యకు ఉబ్బితబ్బయిపోతోంది. సామాజిక మాధ్యమాలలో ఈ చర్యలకు తామే కారణం అంటూ ఊదరగొట్టేస్తోంది. మరో పక్క ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని రగిలిస్తున్న ట్రంప్ వంటి రాజకీయ నేతల వాదనకు ఈ సంఘటన బలాన్నిచ్చినట్లు అయ్యింది. ఈ సంఘటన తరువాత పాశ్చాత్య దేశాలలో ఉన్న ముస్లింలు మరింత అభద్రతా భావనకు లోనయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒర్లాండో కాల్పులు ఒక రకంగా అమెరికాకు హెచ్చరికే! ఈ సంఘటన తరువాత అమెరికా చేపట్టాల్సిన చర్యలు చాలానే ఉన్నాయి. ప్రపంచానికి పెద్దన్నగా భావించే అమెరికా, ఒకరి మాట వినే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ తుపాకి సంస్కృతిని, ప్రజల్లోని అభద్రతా భావాన్నీ, పెరిగిపోతున్న ఉగ్రవాద భావజాలాన్నీ... రాబోయే కాలంలో ఎలా అదుపుచేస్తుందన్నదే వేచి చూడాల్సిన విషయం.
Nirjara