అంధ కళాకారుల అద్భుత ప్రతిభ
posted on May 20, 2015 11:16AM
మంగళవారం నాడు హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్లో అత్యంత వైభవంగా జరిగిన ‘తెలుగువన్’ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో అంధ కళాకారులు ప్రదర్శించిన ప్రతిభ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. అంధ కళాకారులు సంగీత, నృత్యాలతో అలరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న పలువురు అంధ విద్యార్థులు విశ్వదృక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వేదిక మీద తమ ప్రతిభను ప్రదర్శించారు. పలువురు గాయకులు తమ మధుర గాత్రంతో సభికులను రంజింపజేశారు. ముగ్గురు అంధులు తామే కంపోజ్ చేసిన నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యాన్ని చూసి అందరూ మైమరచిపోయారు. వీరి ప్రతిభను గుర్తించిన ఒక అజ్ఞాత దాత వారికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే దుబాయ్ నుంచి వచ్చిన అతిథి ఒకరు వీరి ప్రదర్శనను గల్ఫ్‌లో ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ అయితే అంధ కళాకారుల ప్రతిభను మనస్పూర్తిగా ప్రశంసించారు. తనను చూడలేకపోయినా, తాను తీసిన సినిమాలను వారు చూడలేకపోయినా తన ముందు పాడటం వారికి సంతోషాన్ని కలిగించడం తన హృదయాన్ని స్పృశించిందని ఆయన అన్నారు. వారు పాటలు పాడుతున్నప్పుడు, నృత్యం చేస్తున్నప్పుడు వారిలో తనకు భగవంతుడు కనిపించాడని, వారికి తన పాదాభివందనాలని చెప్పారు.