తెలంగాణ ఏర్పాటు అసంభవం!

 

 

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యం, అసంభవమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకు అసాధ్యమో కూడా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా ఏడు దశల్ని దాటాల్సివుంది. కానీ ఈ దశలన్నిటినీ దాటేంత సమయం కేంద్రంలో వున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి లేదు.

 

మాంత్రికుడి ప్రాణం ఉండే చిలకని పట్టుకోవాలంటే సప్త సముద్రాలు దాటాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను భార్యాభర్తలుగా అభివర్ణిస్తూ ఏడుగులు వేయించారు. ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇప్పుడు ఈ ఏడడుగుల బంధాన్ని తెంచాలంటే కూడా ఏడు కీలకమైన అడుగులు వేయాల్సి వుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏడు కీలక దశల్ని తప్పనిసరిగా దాటాల్సి వుంటుంది. అవి...



1. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బిల్లు డ్రాఫ్ట్ తయారు చేయాలి. దీనికోసం పరిపాలనకు సంబంధించిన అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని దానిని క్రోడీకరించుకోవాలి. అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత బిల్ డ్రాఫ్ట్ రూపొందించాలి. దీనికి మొత్తం తక్కువలో తక్కువగా రెండు నెలల సమయం పడుతుంది.

2. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తయారు చేసిన బిల్ డ్రాఫ్టుని ప్రజలు, వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్ కోసం ఒక నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఆ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్‌ని పరిశీలించి డ్రాఫ్టులో మార్పులు, చేర్పులు ఏవైనా అవసరమైతే చేయాలి. ఆ తర్వాత దానిని కేంద్ర కేబినెట్‌కి పంపాలి.

3. కేంద్ర కేబినెట్ బిల్లు డ్రాఫ్ట్ మీద చర్చించాలి. ఆమోదించాలి. తర్వాత దానిని రాష్ట్రపతికి పంపాలి.

4. రాష్ట్రపతి డ్రాఫ్ట్ ని పరిశీలించిన తర్వాత ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యుల అభిప్రాయం తెలుసుకోవడం కోసం రాష్ట్ర గవర్నర్‌కి పంపించాలి.

5. రాష్ట్ర శాసనసభలో డ్రాఫ్ట్ మీద చర్చ జరగాలి. శాసనసభ్యులు ఒక తీర్మానం చేసి కేంద్ర కేబినెట్‌కి పంపించాలి.

6. కేంద్ర కేబినెట్ డ్రాఫ్ట్ ని, అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలి.

7. ఆ తర్వాత పార్లమెంట్‌లో చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందాలి.

ఈ ఏడు దశలు దాటేసరికి మొత్తం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సమయం పడుతుంది. పార్లమెంట్ చివరి సమావేశాలైన శీతాకాల సమావేశాల్లో బిల్లు తప్పనిసరిగా ఆమోదం పొందితీరాలి. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌లోనే మొదలవుతాయి. శీతాకాల సమావేశాల నాటికి ఈ ప్రొసీజరంతా పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం కూడా లేదు.