చిరు ధైర్యం వెనుక మతలబేంటి?

 

 

 

అప్పుడెప్పుడో కాస్తంత ధైర్యం చేసి హైదరాబాద్‌ని శాశ్వత యు.టి. చేయాలన్న స్టేట్‌మెంట్ ఇచ్చిన కేంద్రమంత్రి చిరంజీవి ఈమధ్య కాలంలో మళ్ళీ అలాంటి ధైర్యాలేవీ చేయకుండా అధిష్ఠానం దృష్టిలో చిరు మంచి బాలుడు అనే ఇమేజ్ సంపాదించునేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారశైలి ఆయన్ని సీమాంధ్ర ప్రాంతానికి మరింత దూరం చేసింది.

 

తాజాగా చిరు మరోసారి ధైర్యం చేసి సీమాంధ్రులకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర విభజనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నానని, రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి వరకు పోరాడతానని అన్నారు. తెలంగాణపై తీర్మానం, బిల్లు రెండూ అసెంబ్లీకి తప్పనిసరిగా పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, భయాలు, ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం ముందు వెళ్తూ ఉండడాన్ని సహించలేనని చెప్పారు. చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ సగటు సీమాంధ్రుడికి ఆనందం కలిగించవచ్చేమోగానీ, రాజకీయ పరిశీలకులను మాత్రం ఆలోచనలో పడేసింది.

 

 

చిరంజీవి ఏమిటీ.. ఇంత దూకుడుగా వ్యవహరించటమేమిటన్న సందేహాలు కలుగుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతున్నా చిరంజీవి తన పదవిని పట్టుకుని వేలాడుతున్నారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో వుంది. తనకు, సీమాంధ్ర ప్రజలకు మధ్య ఏర్పడ్డ ఆ గ్యాప్‌ని పూడ్చుకోవాలన్న ఆలోచనలో ఎప్పటినుంచో చిరంజీవి వున్నారు. మరోవైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రుల దృష్టిలో సీఎం కిరణ్ హీరోగా మారుతున్నారు. తాజాగా రాష్ట్రపతి, ప్రధానికి విభజనను వ్యతిరేకిస్తూ లేఖలు రాయటం ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్‌ని మరింత పెంచింది. ఇవన్నీ ఇలా చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో కిరణ్ సీమాంధ్ర ఛాంపియన్‌గా నిలబడిపోయే అవకాశం ఉందని ఊహించిన చిరంజీవి, కిరణ్‌కి పోటీగా తాను కూడా రంగంలో వున్నానని నిరూపించుకోవడం కోసమే సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా, ధైర్యంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.