కేటీఆర్ పై అక్బరుద్దీన్ ఫైర్.. అక్బరుద్దీన్ అసలు ప్లాన్ అదా?
posted on Oct 1, 2015 4:31PM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైతు ఆత్మహత్యాలపై జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఒవైసీ అధికార పార్టీ దుమ్ము దులిపేశారు. మద్యలో కలుగజేసుకున్న కేటీఆర్ కు కూడా ఘాటుగానే సమధానం చెప్పి కేటీఆర్ ను సైతం ఏం మాట్లాడనీయకుండా చేశారు. అయితే తాను రైతుల ఆత్మహత్యలపై అంతలా రియాక్ట్ అవడానికి వేరే కారణం ఉందని వార్తలు వచ్చాయి. తాను కూడా చావు దాకా వెళ్లానని..ఆ బాధ నాకు తెలుసని అక్బరుద్దీన్ చెప్పినట్టు తెలిసింది. అయితే దానికి మరో కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
అసలు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూసిన సంగతి అందరికి తెలిసిందే. దీనిలో భాగంగానే వారితో మంతనాలు కూడా జరిపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనంతరం ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్న తరుణంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది.
అయితే అక్బరుద్దీన్ అంతలా విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు. అసలే ప్రస్తుతం అధికార ప్రభుత్వం పరిస్థితి అంతంత మాత్రం ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం ఇప్పుడు ప్రజల్లో లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అనవసరంగా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పార్టీని కష్టాల్లో పడేయటం కంటే పొత్తు పెట్టుకోకుండా ఉండటమే మంచిదని ఆలోచించిన అక్బరుద్దీన్ ఈరకంగా అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకతను చూపించారని రాజకీయ వర్గాల వెల్లడి. అందుకే రైతు ఆత్మహత్యల సమావేశంలో కేటీఆర్ ను టార్గెట్ చేశారని అనుకుంటున్నారు.