తె.దే.ప. తన వైఖరిని ఎందుకు ప్రకటించటలేదు?

 

 

గత రెండు నెలలుగా తెలంగాణాలో విస్తృతంగా పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, తను తన పార్టీ తెలంగాణాకి ఎంతమాత్రం వ్యతిరేఖం కాదని, అఖిలపక్షసమావేశంలో కానీ, మరెక్కడయినా గానీ, తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడబోమని హామీలుఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వారంలో జరగనున్న అఖిలపక్షసమావేశoలో తెలుగుదేశం పార్టీ ఏమిచెప్పాలనే విషయంపై చర్చించడానికి ఈరోజు తెలుగుదేశం తెలంగాణా ఫోరం నేతలందరూ కూడా చంద్రబాబుతో కరీంనగర్ లో సమావేశంఅయ్యేరు. సమావేశo తరువాత, తెలంగణా ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా వారితో మాట్లాడుతూ, తామందరమూ పార్టీ అధినేతకు తెలంగాణా విషయంపై తమ తమ అభిప్రాయాలు తెలియజేశామని చెప్పారు. రేపు పార్టీకి చెందిన సీమాంధ్రా నేతలతో కూడా చంద్రబాబు సమావేశం అయ్యి వారి అభిప్రాయాలు కూడా తీసుకొన్న తరువాత 27వ తేదిన పార్టీ తరపున అఖిలపక్షసమావేశానికి వెళ్ళే ఇద్దరిపేర్లు ప్రకటిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. అయితే, పార్టీ తరపున ఇద్దరు వెళ్ళినప్పటికీ ఇద్దరూకూడా ఒకేఅభిప్రాయం వ్యక్తం చేయబోతున్నారని ఆయన తెలియజేసారు. అయితే, ఆ అభిప్రాయం ఏమిటనేది ఇప్పుడు వెల్లడించలేమని చెప్పారు.

 

ఇక తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రకటనలు, చంద్రబాబు మాటలు విన్నట్లయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణాకి అనుకూలంగా ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఇంతవరకు ఆ పార్టీకిచెందిన సీమాంధ్రా నేతలెవరూ కూడా పార్టీ సమైక్యాంద్రాకే కట్టుబడి ఉండాలని గట్టిగా కోరుతూ ప్రకటనలు చేయకపోవడం గమనించినట్లయితే, అటువైపునుండి కూడా రాష్ట్ర విబజనకు పెద్దగా అభ్యంతరాలు లేవన్నట్లే అర్ధమవుతోంది. పార్టీలో తెలంగాణాకి ఇంత సానుకూలంగా ఉన్నపటికీ, మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు తానూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలమని ప్రకటన చెయ్యట్లేదు?

 

బహుశః అది బంతిని కాంగ్రేసు కోర్టులో పడేసి ముందుగా ఆపార్టీ చేత తెలంగాణాకి అనుకూలమా లేక వ్యతిరేఖమా లేక ఎటూ తేల్చకుండా నాన్చబోతోందా అనే ప్రకటన చేయించగలిగితే, అప్పుడు వచ్చే ప్రతిస్పందనబట్టి తన నిర్ణయంలో మార్పులు చేసుకోవచ్చని ఎదురుచూస్తున్నట్లు అనుకోవచ్చును.

 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర వైపే మొగ్గు చుపినట్లయితే, తానూ తొందరపడి ముందుగా రాష్ట్ర విబజనకి అంగీకరిస్తూ ఇప్పుడే ప్రకటన చేసేస్తే, అది సీమంద్రా ప్రాంతాలలో పార్టీకి నష్టం కలిగించవచ్చును. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టనపుడు, తెలుగుదేశం పార్టీ ముందుగా విడిపోవాలనికోరుతూ నోరువిప్పి సమస్యలు తెచ్చుకోవడమెందుకు అనేది దాని ఆలోచన అయ్యి ఉండవచ్చును. పైగా కాంగ్రెస్ సమైక్యమనప్పుడు, తానూ విబజన అనిఅంటే అది కాంగ్రేసుకి సీమంద్రా ప్రాంతాలలో ఒక వరంగా మారుతుంది.

 

ఒకవేళ తానూ సమైక్యాంధ్రకి అనుకూలమని ప్రకటన చేసినట్లయితే, కాంగ్రేసు నెత్తినపడాల్సిన బండ చేజేతులా తన నెత్తికి ఎత్తుకొన్నట్లవుతుంది అనేది దానిఅభిప్రాయం అయి ఉండవచ్చును. అప్పుడు ఇక తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో ఇబ్బందులు తప్పవు. అందువల్లే, తెలుగుదేశం పార్టీ ఇంతవరకు రాష్ట్ర విబజనపై తన అభిప్రాయం ప్రకటించేందుకు సాహసించడంలేదు అనుకోవాలి.

 

అయితే, మరొక్క మూడు రోజుల్లో జరుగబోయే అఖిలపక్షసమావేశంలో తప్పనిసరిగా తన వైఖరిని తెలియజేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడూ ఇదే సమస్య ఎదుర్కోవచ్చుకదా? అనే అనుమానం కలగడం సహజం.

 

అప్పుడు తెలుగుదేశం ఏమి చెపుతుందని ఊహిస్తే, కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఎలాగు ముందుగా తెలియజేయనని ఖరాఖండీగా చెప్పేసింది. గనుక, మళ్ళీ అఖిలపక్ష సమావేశంలోకూడా ప్రస్తుత వైఖరినే తెలుగుదేశం అవలంబించవచ్చును. అంటే, కాంగ్రెస్ కోర్టులో మళ్ళీ బంతిని పడేసి “రాష్ట్ర విబజనపై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నా తమకు ఆమోదమే!” అని ఒకే ఒక వాక్యం చెప్పి చల్లగా బయటకి రావచ్చును. అప్పుడు, నిర్ణయం ప్రకటించాల్సిన బాద్యత కాంగ్రెస్ నెత్తినేపడి, తెలుగుదేశం సేఫ్ సైడ్ లో ఉంటుంది. అప్పుడు, మేము తెలంగాణాకి అనుకూలమో వ్యతిరేకమానో చెప్పలేదు గాబట్టి, ‘తెలంగాణా ఇచ్చేది తెచ్చేది కాంగ్రేసే’ అని డప్పు కొట్టుకొని తిరుతున్న కాంగ్రెస్ నేతల మీద తీవ్ర ఒత్తిడి మొదలవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒడ్డున పడిన చేపపిల్లలా గిలగిలమని కొట్టుకొంటుంటే, తెలుగుదేశం తాపీగా ఒడ్డున కూర్చొని ముచ్చటగా చూడగలదు.

 

ఈ భయంతోనే తెరాస నేతలు చంద్రబాబు చేత ఎలాగయినా అఖిలపక్షంలో కూర్చొనే లోపుగానే అతని నోట తెలంగణా అంశంపై మమ అనిపించేస్తే ఇక మరి దానికే కట్టుబడి ఉండక తప్పదు అని ఆలోచించి తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టంగా ముందే ప్రకటించాలని పట్టు బడుతున్నారు. గానీ, బాబు నోట ఆ ముత్యాలు రాలితే ఎరుకొందామనే వారి ఆశ అడియాశే అవుతుంది.