బెంగళూరు ప్రత్యేక కోర్టుకు చేరుకున్న జయలలిత

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద వున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు కోర్టు శనివారం తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు జయలలిత చేరుకున్నారు. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట జయలలిత హాజరు కానున్నారు. ఈ తీర్పు విషయంలో తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని వుంది. ఈ కేసులో తీర్పు జయలలితకి వ్యతిరేకంగా వస్తే ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వుంటుంది. గతంలో ఇలాగే జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే తన నమ్మినబంటు పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టారు. మరి ఇప్పుడు ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. జయలలిత కేసు తీర్పు సందర్భంగా వేలాదిమంది ఎఐడీఎంకే కార్యకర్తలు ప్రత్యేక కోర్టు వద్దకు చేరుకున్నారు. జయలలితకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిమీద లాఠీఛార్జ్ కూడా చేశారు.