ఏపీ రాజ్యసభ అభ్యర్దిగా సురేష్ ప్రభు నామినేషన్..

 

ఏపీ కోటా నుండి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్దిగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకి టికెట్ ఖాయం అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్ వచ్చిన ఆయన పలువురు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ అయిన సురేష్ ప్రభు, పార్టీ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన బస చేసిన ప్రాంతానికి తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. మరికాసేపట్లో నామినేషన్ వేసేందుకు వెళ్లనున్న సురేష్ ప్రభు వెంట అసెంబ్లీకి విష్ణుకుమార్ రాజు, కావూరీ తదితర బీజేపీ నేతలు తోడు వెళ్తారని తెలుస్తోంది. కాగా ఏపీ కోటాలో టీడీపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కగా అందులో మిత్రపక్షమైన బీజేపీకి ఒక స్థానం ఇచ్చింది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు అవకాశం దక్కింది.