సుప్రీమ్ చెప్పాకైనా మోదీ సర్కార్ గోరక్షకులపై దృష్టి పెడుతుందా? 

గతంలో అసలు జరిగేవి కావో లేక మీడియా ఇంతగా రిపోర్ట్ చేసేది కాదో… కానీ, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ పెద్ద తలనొప్పిగా మారిపోయిన సమస్య గోరక్షకుల దాడులు! నిజంగా ప్రధానికి ఈ దాడుల్లో ప్రమేయం వుండదని తెలిసినా చివరకు ఆయనని, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది ప్రతీ ఒక్కరికి. ఎందుకంటే, ఎక్కడైనా ఓ రాష్ట్రంలో కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా ఒకరిద్దరిపై దాడి చేస్తే అది శాంతి భద్రతల సమస్య. రాష్ట్రం పరిధిలోనిది. కానీ, మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచీ ఒక మతాన్ని, కొన్ని కులాల్ని కావాలని గురి చూసి దాడులు జరుగుతున్నాయని వాదన వినిపిస్తోంది. ఇది ఆందోళనకరమైన పరిణామమే. స్వయంగా సుప్రీమ్ కోర్టు కూడా అదే అంటోంది…

 

 

కోర్టులో దాఖలైన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రత్యేక చట్టం చేయమని ఆదేశించింది. రాష్ట్రాల్ని కూడా జనం చట్టాల్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా చూడాలని ఆదేశించింది. గో రక్షకులమని చెప్పుకుంటూ మందలుగా మారి దాడులు చేయటం నిజంగా దుర్మార్గం. కానీ, ఉత్తరభారతంలో గత కొన్ని ఏళ్లుగా ఇది మామూలైపోయింది. దీనికి ప్రస్తుత మోదీ ప్రభుత్వం కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది ఎంత వరకూ నిజమనేది పక్కనపెడితే చాలా రాష్ట్రాల్లో అమాయకులు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా గోరక్షకుల దాడులతో కలవర పెడుతున్నాయి. దీన్ని అరికట్టడానికి అవసరమైన చట్టం తేవాలని సుప్రీమ్ సూచించింది. పార్లమెంట్లో ఈ తరహా చట్టం తేవటానికి పెద్దగా అడ్డంకులు కూడా వుండకపోవచ్చు. అన్ని పార్టీలు అంగీకరిస్తాయి కూడా.

 

 

చట్టం తీసుకురావాలన్న కోర్టు మరిన్ని సూచనలు కూడా చేసింది. దాడి జరిగినప్పుడు నష్ట పరిహారం బాధితుల మతం, కలం చూసి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. వారికి జరిగిన నష్టం ఆధారంగా నిర్ణయించాలని సూచించింది. బాధితులు ఏ మతం వారైనా వుండవచ్చిన అభిప్రాయపడింది. సుప్రీమ్ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా చట్టాన్ని తెస్తే అంత మంచిది. లేదంటే ఎంతో మంది అమాయకులు ఇంకా బలయ్యే అవకాశాలున్నాయి. కేవలం గోరక్షకుల దాడులే రాజకీయంగా చర్చకు వస్తున్నాయి కానీ… చాలా చోట్ల అనేక కోణాల్లో జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. రోడ్లపైనే హింసతో చెలరేగిపోతున్నారు.

 

 

కొద్ది రోజుల క్రితమే కేవలం ఒక వాట్సప్ మెసేజ్ కారణంగా ఒక సాఫ్ట్ వేర్ టెక్కీ జనం దాడిలో మరణించాడు. అతడ్ని పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిగా భావించి జనం కొట్టి చంపారు. ఇలాంటివి జరగటానికి అనేక కారణాలే వున్నా… ప్రధానంగా మందగా మారిపోయి దాడి చేస్తే ఎవరికీ శిక్షలు పడటం లేదు. అదే జనంలోని అరాచకులకి ఊతం ఇస్తోంది. కొంత వరకూ అనుమానం వున్నా, లేదా ఏదో ఇతర కోపం వున్నా… మరో పది మందితో కలిసి దాడులు చేస్తున్నారు. చివరకు ఎలాంటి శిక్షా లేకుండా తప్పించుకుంటున్నారు. ఇది సమాజానికి అస్సలు క్షేమం కాదు. కఠినమైన చట్టం తీసుకు రావటమే సమస్యకి కొంత మేర పరిష్కారం చూపుతుంది!