నటి సుకన్యకి 10 లక్షల పరిహారం
posted on Apr 17, 2015 1:42PM
ప్రముఖ సినీ నటి సుకన్యకు సన్ టీవీ యాజమాన్యం పది లక్షల 500 రూపాయల పరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. 1996 సంవత్సరంలో సుకన్య వేసిన కేసుకు ఇప్పుడు తీర్పు వచ్చింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ బతికున్న రోజుల్లో నక్కీరన్ పత్రిక ఎడిటర్ గోపాల్ అడవుల్లోకి వెళ్ళి వీరప్పన్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూని ‘నక్కీరన్’ పత్రికలో ప్రచురించారు. సన్‌టీవీతో వున్న ఒప్పందంలో భాగంగా వీరప్పన్ వీడియో ఇంటర్వ్యూని ప్రసారం చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ మాట్లాడుతూ, హీరోయిన్ సుకన్య మీద కొన్ని కామెంట్లు చేశాడు. అప్పుడు హీరోయిన్‌గా వున్న సుకన్య వయసు 18 సంవత్సరాలు. వీరప్పన్ తన మీద కామెంట్లు చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేయడం మీద సుకన్య మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. సన్ టీవీని, వీరప్పన్‌ని, నక్కీరన్ ఎడిటర్ గోపాల్‌ని ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆ కేసు ఇంతకాలం సాగీ సాగీ ఇప్పుడు తీర్పు వచ్చింది. సన్ టీవీ కారణంగా మనోవేదనకు గురైన సుకన్యకు సన్ టీవీ యాజమాన్యం 10 లక్షల 5 వందల రూపాయలను పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.