బియ్యం గింజలపై శ్రీరామ నామం...ఆ రామునికే అక్షింతలుగా సమర్పణం
posted on Apr 27, 2022 10:04AM
భక్తికి ఎల్లలు ఉండవంటారు. భగవంతునిపై తన భక్తిని ప్రదర్శించేందుకు ఏకంగా కన్నులు పెకలించుకున్నాడు కన్నప్ప. ప్రాణాలనే తృణ ప్రాయంగా అర్పించేశాడు మార్కండేయులు. భగవంతుని పై తనకున్న భక్తిప్రపత్తులను బియ్యపు పై గింజ అక్షరాలుగా మలిచి ఆ దేవుడికే తలంబ్రాలుగా అర్పించాడు ఈ భక్తుడు. నిజామాబాద్ ఇందూరు ఆర్టీసీ కాలనీకి చెందిన బిల్ల బాబు, పదవి విరమణ అనంతరం ఆధ్యాత్మిక చింతనతో శ్రీరాముడి పై తనకున్న భక్తి భావాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది లక్షల యాభై ఒక్క వెల బియ్యపు గింజల పై శ్రీరామ నామాన్ని రాశారు. ఇందు కోసం ప్రతి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానాంతరం భగవంతునికి పూజ చేసి జెల్ పెన్‌తో రామ నామాన్ని తెలుగు, హిందీ భాషలలో లిఖిస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు లిఖించిన బియ్యపు గింజలను ఇందూరు ఖిల్లా రామాలయంలో శ్రీసీతారాముల వారి కళ్యాణానికి రెండు మార్లు, ఇందూరు సుభాష్ నగర్ రామాలయంలో ఒక సారి, భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణంలో తలంబ్రాలలో కలపటం జరిగింది. ప్రస్తుతం కూకట్ పల్లి వివేకానంద నగర్ కాలనీలో నివాసిస్తున్న బాబు నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన కూకట్ పల్లి రామాలయం పునః ప్రతిష్ట కార్యక్రమం అనంతరం నిర్వహించిన శ్రీసీతారాముల కళ్యాణానికి రామ నామాన్ని లిఖించిన తొమ్మిది వేల నూట పదహారు బియ్యపు గింజలను తలంబ్రాలలో కలిపారు.