ఖాళీగా రోడ్ల మీద తిరిగితే జైలుకే.. ఆవారా, పోకిరీలను టార్గెట్ చెయ్యనున్న పోలీసులు

 

గ్రామాల్లో మహిళల రక్షణ.. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు మహిళలతో ప్రత్యేక కమిటీలను వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలు గ్రామంలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు తెలియజేస్తారు. కమిటీలో గ్రామ కార్యదర్శి ఆయా మహిళా స్వశక్తి సంఘాలకు చెందిన ప్రతి నిధులు సభ్యులుగా ఉంటారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశమయ్యారు.

ముఖ్యంగా గ్రామాల్లో జరిగే కొన్ని అసాంఘిక ఘటనలు.. జులాయిగా తిరిగే పోకిరీల చర్యలు పోలీసుల దృష్టికి రావడం లేదని అభిప్రాయపడ్డారు. గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ గ్రామాల్లో జరిగే అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారమిచ్చే అవకాశముంటుందని భావించారు. కమిటీల్లో మహిళా గ్రూపులను భాగస్వాములను చేయడం ద్వారా మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. మహిళలందరికీ క్లిష్ట సమయాల్లో ఏం చేయాలనే దానిపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చదువుతో సంబంధం లేకుండా వీరి కోసం ప్రత్యేకంగా ఈ-ఎంపవర్ మెంట్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సును ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సులో మహిళల రక్షణకు సంబంధించి 17 నుంచి 20 ప్రశ్నలుంటాయి. వీటికి సరైన సమాధానం చెబితే సర్టిఫికెట్ ఇస్తారు. ఈ కోర్సులో క్లిష్ట సమయంలో ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, పోలీసులకు ఏ విధంగా సమాచారమివ్వాలి ఇలాంటి అంశాల పై ప్రశ్నలుంటాయి. ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని మహిళలందరూ కోర్సును పూర్తి చేయవచ్చు.

మహిళల రక్షణపై విస్తృత అవగాహన చేపట్టాలనీ పట్టణాలలోని అపార్టుమెంట్లు కాలనీల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇక పరిధితో సంబంధం లేకుండా మహిళల అపహరణకు సంబంధించిన కేసులను తక్షణమే రిజిస్టర్ చేసి వెంటనే రంగంలోకి దిగాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు షీ టీమ్స్ ను బలోపేతం చేస్తారు. హ్యాక్ ఐ యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీస్ యాప్, డైల్ 100, 101,1091,112 పై విస్తృత ప్రచారం చేస్తారు. హెల్ప్ లైన్ నెంబర్ లో కనిపించే విధంగా విద్యా సంస్థలు రవాణా వాహనాల్లో నోటీసు బోడ్లు పెడతారు.ప్రభుత్వ కార్యాలయాల్లో బహిరంగ స్థలాల్లో పాఠ్యపుస్తకాల మీద హెల్ప్ లైన్ నెంబర్లు కనిపించే విధంగా ఏర్పాటు చేస్తారు. రాష్ట్రమంతటా హోర్డింగ్స్, గోడల పై పెయింటింగ్ వేయించమన్నారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడుతున్నట్లయితే కళాశాలలు రహస్యంగా తమకు నివేదించాలని పోలీసులు సూచించారు. దానిపై రహస్య విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి ఉద్యోగం లేకుండా జులాయిగా తిరిగే వాళ్ల పై దృష్టి పెట్టాలని పోలీసు శాఖ భావిస్తోంది. కనీస అవసరాల ఖర్చుల కోసం ఇనుము, వాహనాల్లోంచి పెట్రోల్, డీజిల్, ఇళ్లల్లో రాత్రిపూట వస్తువుల దొంగిలిస్తూ తిరిగే వాళ్ల పై ఎక్కువ నిఘా పెట్టనున్నారు. నేరగాళ్ల మనస్తత్వం, జీవన విధానాలకు దగ్గరగా ఉన్న వాళ్ల పై ఎక్కువ నిఘా ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. వైట్ నర్ కు బానిసలై రైల్వే స్టేషన్ లు డంపింగ్ యార్డుల్లో సంచరించే వాళ్లపై కూడా కన్నేసి ఉంచుతారు.