బీహార్ సంగతి సరే.. మిగిలిన రాష్ట్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయా.. బీజేపీపై మండిపడ్డ శివసేన 

బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ హామీపై ఇపుడు దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఒకప్పటి మిత్రపక్షమైన శివసేన తన అధికార పత్రిక సామ్నా వేదికగా ఈ హామీని తీవ్రంగా తప్పు పట్టింది. "ప్రాణాంతకమైన కరోనా వైరస్ ను ఎదుర్కునే వ్యాక్సిన్ పై బీజేపీ రాజకీయాలు చేస్తోంది. బీహార్ కు కరోనా వ్యాక్సిన్ అందాలి. కానీ మిగిలిన రాష్ట్రాలేమైనా పాకిస్తాన్ లో ఉన్నాయా? వ్యాక్సిన్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులున్నాయి." అని సామ్నాలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

 

కరోనా తో మొత్తం దేశం తీవ్రంగా బాధపడుతోందని, అయితే కేవలం బిహార్ మాత్రమే కోవిడ్ తో బాధపడటం లేదని అలాంటి పరిస్థితిలో వ్యాక్సిన్ రాజకీయాలు చేయడం ఏంటని బీజేపీ పై శివసేన తీవ్రంగా విమర్శించింది. ఇటువంటి పరిస్థితుల్లో జాతి, కుల, మత, ప్రాంత భేదాల్లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, కానీ బీజేపీ మాత్రం బీహార్ ఎన్నికల సందర్భంగా రాజకీయం చేస్తోందని శివసేన తప్పు పట్టింది. అసలు ఈ విషయంలో బీజేపీని ఎవరు గైడ్ చేస్తున్నారో తమకు తెలియదని, బీజేపీ నాయకత్వంలో ఏం లోపముందో కూడా తమకు తెలియదని విమర్శించింది.

 

అంతేకాకుండా బీహార్ ఎన్నికలలో వివిధ పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, ప్రచార సమయంలో కనీసం భౌతిక దూరాన్ని పాటించడం లేదని శివసేన మండిపడింది. "కరోనా మహమ్మారి వ్యాపిస్స్తున్న సమయంలో దేశంలో బిహార్ ఎన్నికలే మొట్టమొదటివి. దీంతో అన్ని ర్యాలీలు వర్చువల్ ర్యాలీలుగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే పార్టీలు ఆ విషయాల్నే మరిచిపోయినట్లున్నాయి. అసలు భౌతిక దూరం అనేది ఏమాత్రం లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు హెలికాప్టర్ల సహాయంతో వివిధ ప్రాంతాలకు వెళ్లి, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహుశా బిహార్ లో ప్రస్తుతానికి కరోనా వైరస్ లాంటిదేమీ లేదు కాబోలు." అంటూ సామ్నా వేదికగా శివసేన సెటైర్లు వేసింది.