60ఏళ్ల ముసలాయన్ని చెప్పుతో కొట్టాడు... పైగా అదో గొప్పగా చెప్పుకుంటున్నాడు!

మన దేశంలో అత్యంత అరుదుగా కనిపించే మంచి పొలిటీషన్స్ ని పక్కన పెడితే .. దుర్మార్గ రాజకీయ నతేలు రెండు రకాలు! మొదటి రకం బాగా చదువుకున్నట్టు కనిపిస్తూ వ్యవస్థని నిర్వీర్యం చేసే అవినీతిపరులు. ఇక రెండో రకం, ఖద్దర్ బట్టలు వేసుకుని చట్ట సభల్లోకి జొరబడ్డ రౌడీలు, గూండాలు! తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రచ్చ రచ్చ చేశాడు ఈ రెండో రకం నాయకుడుగారు!

 

అసలు మన దేశంలో ఏదైనా పార్టీ చితక్కొట్టుడు రాజకీయం బాగా ఒంటబట్టించుకుందంటే... అది శివసేననే! ఒకప్పుడు బాలాసాహెబ్ థాక్రే వుండగా ఆ పార్టీ వారు ఉత్తరాది వార్ని ఉతికి ఆరేస్తూ వుండేవారు. అది ఖచ్చితంగా తప్పే అయినా మరాఠీల సంక్షేమం కోసం పోరాడుతోందని భావించి కొందరు చూసి చూడనట్టు సహించే వారు. కాని, రాను రాను శివసేన అరాచకాలు మరీ శృతీ మించిపోయాయి. దానికి తోడు మహారాష్ట్రాలో పుట్టుకొచ్చిన రాజ్ థాక్రే పార్టీ ఎంఎన్ఎస్ కూడా వీలున్నప్పుడల్లా వీపులు విమానం మోత మోగిస్తుంటుంది! అదీ ఎవరో అమాయకుల్ని చూసుకుని మాత్రమే! బలమైన రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ శివసేన, ఎంఎన్ఎస్ నేతలు ఒక్కసారన్నా ఇరగొట్టిన పాపాన పోలేదు. వీరి ప్రతాపం అంతా పేద, మిడిల్ క్లాస్ జనాల మీదే!

 

శివసేన నుంచి ఎంపీగా ఎన్నికైన నాయకుడు రవీంద్ర గైక్వాడ్. ఈయన పూణే నుంచి ఢిల్లీ వచ్చాడు. అయితే, విమానంలో తనకు ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో సీట్ ఎందుకు ఇవ్వలేదని వాదన పెట్టకున్నాడు ఫ్లైట్ లోని స్టాఫ్ తో. ఆ వివాదంలో ఎవరి తప్పు వుందో దేవుడికే తెలియాలి కాని... అతి కష్టం మీద గైక్వాడ్ ని విమానం నుంచి కిందకు దించారు. తరువాత ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళుతుండగా మరోసారి వాదన మొదలుపెట్టాడు ఎంపీ గైక్వాడ్. 61 ఏళ్ల కస్టమర్ సర్వీస్ అధికారితోటి మాటా మాటా పెరిగింది. ఇక మనోడు రెచ్చిపోయి... తన మరాఠా పాలిటిక్స్ స్టైల్లో చెప్పు తీసి ఆ ఉద్యోగిని కొట్టడం మొదలు పెట్టాడు. ఒక్కసారి కాదు... ఏకంగా పాతిక సార్లు చితక్కొట్టాడు! ఇదంతా ఏదో తప్పుడు ప్రచారం అనుకోటానికి కూడా లేదు. గైక్వాడ్ స్వయంగా ఒప్పుకున్నాడు కూడా!

 

రవీంద్ర గైక్వాడ్ తాను ఎయిర్ ఇండియా ఎంప్లాయిపై చెప్పుతో దాడి చేసిన సంగతి సగర్వంగా ఒప్పుకోవటమే కాదు.. ఎలాంటి పశ్చాత్తాపం ప్రదర్శించలేదు కూడా! మీడియా ముందు ఎలాంటి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఢంకా బజాయించాడు! ఈయనగారు ఇలా చేయటం మొదటి సారి అనుకోకండి! గౌరవనీయ ఎంపీ గైక్వాడ్ గారు రెండ్రోజులు క్రితమే ఒక డీఎస్పీ మీద ఇష్టం వచ్చినట్టు మరాఠీలో కేకలు వేశాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది! 

 


శివసేనలో గైక్వాడ్ లో లాంటి నాయకులు, కార్యకర్తలు బోలెడు మంది! ఇక మిగతా పార్టీల సంగతి కూడా బెటర్ గా ఏం లేదు. కాకపోతే , శివసేన, ఎంఎన్ఎస్ ల మాదిరిగా పబ్లిక్ గూండాగిరి చేయకపోవచ్చు. అంతే తప్ప మన దేశంలో ఈ రౌడీ కల్చర్ అన్ని పార్టీలకు, అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. టోల్ గేట్ల వద్ద నుంచీ ఎయిర్ పోర్ట్ ల వరకూ ఎక్కడ పడితే అక్కడ మన నేతలు తమ స్థాయి మరిచి రచ్చ చేస్తుంటారు! ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యాక కూడా పూర్వాశ్రమం వాసనలు వీర్ని వదలటం లేదు! దీనికి సరైన పరిష్కారం చట్ట సభల్లో వీరికి తగిన శిక్షలు పడటమే. క్రమశిక్షణ సంఘాలు గైక్వాడ్ లాంటి నేతల్ని గట్టిగా శిక్షించాలి. అప్పుడైనా కొంత బుద్ది రావొచ్చు!

 

తమ ఎంప్లాయి పై దాడి చేసిన గైక్వాడ్ ను శాశ్వతంగా తమ సర్వీసుల్లో తిరగకుండా బ్యాన్ చేద్దామనుకుంటోంది ఎయిర్ ఇండియా. దాని వల్ల గైక్వాడ్ కు వచ్చే నష్టమేం లేదు కాబట్టి ఆయన ప్రవర్తన మారుతుందని ఆశించలేం. ఇక ఇప్పటికే ఆయన వివరణ కోరిన శివసేన పార్టీ కూడా ... సదరు రౌడీ ఎంపీపై తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని ఆశించనక్కర్లేదు!