సిబ్బంది నిర్లక్ష్యం..చచ్చేవాడికి వైద్యం ఎందుకు..?
posted on May 25, 2016 9:46AM
చావు బతుకుల మధ్య ఉన్న రోగిని శతవిధాలా కాపాడేందుకు ఎంతోమంది వైద్యులు ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రిలోకి చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. శంషాబాద్‌లోని ఆహ్మద్‌నగర్ బస్తీకి చెందిన జోగు శ్రీను అనే వ్యక్తికి సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు 108 సాయంతో హుటాహుటిన శంషాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పుడు విధుల్లో ఉన్న ఎంన్‌ఓ నాసర్‌ఖాన్, వాచ్‌మెన్ కృష్ణ మద్యం మత్తులో ఉండి అంబులెన్స్‌ను ఆస్పత్రిలోకి రానివ్వకుండా రోగి బతకడు..వైద్యం అవసరం లేదని బాధ్యతారాహిత్యంగా గొడవకు దిగారు. విషయం మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈ లోపు మీడియా ప్రతినిధులు రావడంతో సిబ్బంది గేట్ తెరిచారు. వైద్యులు రోగికి వెంటనే సెలైన్ ఎక్కించడంతో అతని ప్రాణం నిలబడింది. అక్కడ ఏమాత్రం అటు ఇటైనా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేది.