మన రైళ్లలో భద్రత డొల్లేనా?
posted on Jun 5, 2023 2:05PM
భారత రైల్వే ప్రయాణీకుల భద్రతను గాలిలో దీపంగా మార్చేసిందనడానికి ఒడిశాలోని బాలాసూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాద సంఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల మంది మృత్యువాత పడిన ఆ సంఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఒక వైపు సాగుతుండగానే అదే ఒడిశాలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం (జూన్ 5) ఉదయం ఒడిశాలోని బర్గఢ్ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోయినపపటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం పెను ప్రమాదం తరువాత కూడా ఇసుమంతైనా తగ్గకుండా కొనసాగుతోందనడానికి నిదర్శనంగా ఈ ఘటన నిలుస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న రాత్రి మచిలీపట్నం, తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్లో మంటలు చెలరేగాయి. ప్రయాణీకుల అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటన గుంటూరు స్టేషన్ కు సమీపంలో జరిగింది. చక్రాల రాపిడి కారణంగా మంటలు చెలరేగాయని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు లూబ్రికెంట్లు అయిపోవడమే కారణమంటున్నారు. ప్రయాణీకులు అప్రమత్తమై వెంటనే చైను లాగి రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు రెండు గంటల తరువాత రైలు అక్కడ నుంచి తిరుపతికి బయలుదేరింది.
వరుస ప్రమాదాలతో రైలు ప్రయాణమంటేనే జనం భయపడే పరిస్థితి తలెత్తింది. ఒక బాలాసూర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదానికి సిగ్నల్ సెట్టింగ్ లను ఎవరో మార్చివేయడమే కారణమని స్వయంగా రైల్వే మంత్రి చెప్పడంతో అసలు రైళ్లలో ప్రయాణం ఏ మాత్రం సేఫ్ కాదని పలువురు విమర్శస్తున్నారు. కవచ్ రక్షణ ఉన్నా ఆ ప్రమాదాన్ని నిలువరించే పరిస్థితి లేదన్న రైల్వే మంత్రి ప్రకటన ప్రజలలో ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఎవరిష్టం వచ్చినట్లు వారు సెట్టింగ్ లను మార్చేస్తే ఇక రైల్వే శాఖ భద్రతకు ఏం పూచిపడగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు, దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ వంటి ఊకదంపుడు ప్రకటనలతో సరిపుచ్చడం కాకుండా.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనకు కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్నిటికీ మించి రైల్వే శాఖలో నిర్లక్ష్యం ఏ మేరకు పేరుకు పోయిందనడానికి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల గురించి ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మూడు నెలల కిందటే హెచ్చరించినా.. ఆ లోపాల సవరణ దిశగా ఏ చర్యా తీసుకోకపోవడమే నిదర్శనం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రాథమికంగా వెల్లడించిన నేపథ్యంలో- ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం చర్చనీయాంశంగా మారింది. నైరుతి రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు. ఫిబ్రవరి 8న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. నాడు వాస్తవానికి అప్ మెయిన్ లైన్‌లో వెళ్లేందుకు ఆ రైలుకు తొలుత అనుమతి లభించింది. కానీ కొద్దిదూరం వెళ్లాక డౌన్ మెయిన్ లైన్‌లో వెళ్లేలా ఇంటర్‌లాకింగ్ ఉండటం కనిపించింది. దాన్ని గుర్తించిన లోకో పైలట్ అప్రమత్తమయ్యారు.
రైలును వెంటనే నిలిపివేశారు. ఇంటర్‌లాకింగ్ ఉన్న ప్రకారం వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదే. సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోందన్నది ఆ లేఖ సారాంశం. కొన్నిసార్లు సిగ్నల్ ప్రకారం రైలు ప్రారంభమయ్యాక.. అది వెళ్లాల్సిన ట్రాక్ మారిపోతోందని పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను నివారించేలా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఆయనా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.న అలా చేయని పక్షంలో ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని లేఖలో హెచ్చరించారు. అయినా రైల్వే శాఖ ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఫలితమే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం.