సెక్షన్: 8కి వక్రబాష్యాలేల?

 

గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ తో డిల్లీలో సమావేశమయి తిరిగి వచ్చిన తరువాత సెక్షన్: 8 అమలు చేస్తారా లేదా? అని అందరూ చాలా ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన హైదరాబాద్ తిరిగివచ్చి రెండు రోజులయినా ఇంతవరకు దాని గురించి ఎటువంటి సంకేతం ఇవ్వలేదు.

 

సెక్షన్: 8కి ఓటుకి నోటు కేసుతో ఎటువంటి సంబంధమూ లేదని కాంగ్రెస్, తెరాస నేతలు చేస్తున్న వాదనలు సహేతుకమయినవే. కానీ తెలంగాణా ట్రాన్స్ కో సంస్థలో పనిచేస్తున్న 1,200 మంది ఆంద్రా ఉద్యోగులను బలవంతంగా బయటకి సాగనంపడం, షెడ్యూల్: 10 క్రింద ఉండే సంస్థలని, ఉద్యోగులను, వాటి స్థిర చరాస్తులన్నిటినీ తెలంగాణా ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం, ఆ సంస్థలలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను కూడా తొలగించేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలన్నీ కూడా సెక్షన్: 8 అమలుకి ప్రేరేపించేవిగానే ఉన్నాయి.

 

హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలందరూ శాంతియుతంగా జీవిస్తున్నారని తెరాస నేతలు చేస్తున్న వాదనలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం తీసుకొంటున్న ఇటువంటి నిర్ణయాల వలన, హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంద్ర ప్రజల పట్ల చూపుతున్న వివక్ష కారణంగా వారిలో ఒకరకమయిన అభద్రతా భావం ఏర్పడిందని, ప్రభుత్వాధినేతల మాటల కారణంగా శాంతియుతంగా జీవిస్తున్న ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందని కనుక సెక్షన్: 8 అమలు తెలంగాణా ప్రభుత్వ స్వయం కృతాపరాధమే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఓటుకి నోటుకి కేసు నుండి బయటపడేందుకే ఆంద్రప్రదేశ్ మంత్రులు సెక్షన్: 8ని అమలుచేయాలని కోరుతున్నారని తెరాస, కాంగ్రెస్, వైకాపా నేతల వాదిస్తున్నారు. దాని అమలుకి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకొన్న ఈ సమయం కారణంగానే వారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం కలిగిందని చెప్పవచ్చును. కానీ సెక్షన్: 8 అమలు చేసినంత మాత్రాన్న గవర్నర్ ఎసిబి మరియు ఎపి సిఐడి చేతుల్లో నుండి ఈ ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను తన చేతిలోకి తీసుకొని వాటిని అటకెక్కిస్తారని భావించలేము. అలాగని చూస్తూ చూస్తూ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడనిస్తారని భావించలేము. కనుక ఒకవేళ ఆయన సెక్షన్: 8ని అమలుచేసినట్లయితే ఈ కేసుల విషయంలో కూడా ఆయన తన విచక్షాణాధికారాలను ఉపయోగించుకొని తగిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఆయన చట్టాన్ని కాదని రాజకీయ నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకొన్నట్లయితే ఆయనకే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కేవలం ఈ రెండు కేసుల కోసమే ఆయన సెక్షన్: 8ని అమలుచేస్తారనుకోవడం అవివేకమే. అంతకంటే కూడా చాలా గంభీరమయిన సమస్యలు ఉత్పన్నం అయ్యే పరిస్థితులున్నట్లు గవర్నర్ భావిస్తే అప్పుడు సెక్షన్: 8ని ఆయన తప్పకుండా అమలుచేయవచ్చును.

 

ఈ సెక్షన్: 8ని అమలు చేసేందుకు ఆయనకు హక్కు ఉందా లేదా? దాని ద్వారా ఆయనకు ఎటువంటి విశేషాధికారాలు పొందుతారు? ఏఏ విషయాలలో ఆయన దఖలు చేసుకోవచ్చును? తెరాస నేత కేశవరావు చెపుతున్నట్లుగా ఆయనకి ఈ సెక్షన్: 8 ద్వారా కేవలం బాధ్యతలే తప్ప ఎటువంటి అధికారాలు ఉంటాయా ఉండవా? అనే చట్టపరమయిన విషయాల గురించి కేవలం కోర్టులకు మాత్రమే నిర్వచించే హక్కు ఉంది తప్ప ఏదో ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయనాయకులు మాత్రం కాదు. అయినప్పటికీ ఈ సెక్షన్: 8 గురించి అందరూ తమకు నచ్చినట్లుగా అన్వయించుకొంటూ రకరకాల బాష్యాలు చెపుతున్నారు. నిజానికి సెక్షన్: 8అమలు కంటే రాజకీయ నాయకులు దాని గురించి మాట్లాడుతున్న మాటలే చాలా ప్రమాదకరంగా కనబడుతున్నాయి. కనుక గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ సెక్షన్: 8 అమలు గురించి స్పష్థత ఇస్తే బాగుటుందని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు.