మహాకూటమిలో లొల్లి.. కాంగ్రెస్, టీడీపీ పొత్తు కష్టమేనా?

తెలంగాణలో తెరాసను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్, తెరాసకు గెలుపును దూరం చేయడం కోసం.. ఏ పార్టీకైనా దగ్గరవడానికి సిద్దపడింది. అదే మహాకూటమికి పునాది పడేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ మహాకూటమితో తెరాసను గద్దె దించడం ఏమో కానీ.. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తలలు పట్టుకుంటుంది. కూటమిలో భాగంగా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి.. 30 నుంచి 35 వరకు స్థానాలను కూటమిలోని మిగతా పార్టీలకు కేటాయించాలనుకుంది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది.

 

 

టీడీపీ 25 నుండి 30 స్థానాలు కేటాయించాలని కోరుతోందట. అమ్మో అన్ని స్థానాలు కష్టం.. మ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు కూడా అవకాశం కల్పించాల్సి ఉన్నందున ఓ 15 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్‌ చెబుతోందట. మరి టీజేఎస్‌ ఏమన్నా తక్కువ తిన్నదా.. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాము.. టీడీపీ కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివాం.. అందుకే టీడీపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారో దానికన్నా ఎక్కువ మాకు రెండు స్థానాలు కేటాయించాలని పట్టుబడుతుందట. అంతేకాదు తాము 35 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నాం అని నియోజకవర్గాల లిస్ట్ కూడా ఇచ్చిందట. అయితే టీజేఎస్‌ తరఫున అభ్యర్థులు బలంగా లేరని.. కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలనే టీజేఎస్‌ అడుగుతోందట. ఈ రెండు పార్టీలకు ఇన్ని సీట్లు ఇచ్చేస్తే ఇక తమకు మిగిలేది ఏంటి అని కాంగ్రెస్ ఆందోళన చెందుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని మహాకూటమి అంటున్నామే గానీ ఇన్ని సీట్లు ఇచ్చేస్తే మొదటికే మోసం రావొచ్చని కాంగ్రెస్ ఆందోళన చెందుతుందట. మరి మహాకూటమిలో మొదలైన ఈ సీట్ల లొల్లి సాఫీగా ముగుస్తుందో లేదో చూడాలి.