అంత్యక్రియలు చేసి అంతమైపోయింది

 

చనిపోయిన తల్లికి తల కొరివి పెట్టడమే ఆమె చేసిన తప్పు. అది ఆమె ప్రాణాలనే తీసింది. తల్లికి అంత్యక్రియలు చేసినందుకు తన సోదరుడే ఆమెను అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ దారుణమైన ఘటన ఛత్తీస్గఢ్, రాయపూర్లోని ఓ గ్రామంలో జరిగింది. గీతావర్మ అనే మహిళ సర్పంచి పదవి చేపట్టి బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే రెండు రోజుల క్రితం తన తల్లి చనిపోగా ఆమె ఆఖరి కోరిక మేరకు అంత్యక్రియలు నిర్వహించింది. అయితే తాను చేయాల్సిన అంత్యక్రియలు ఆమె ఎలా చేస్తుందని గీతావర్మ సోదరుడు సంతోష్ వర్మ మండిపడ్డాడు. అంత్యక్రియలు తరువాత కార్యక్రమాల కోసం ఆమె బంధువులతో కలిసి బావి దగ్గరకు వెళ్లగా, ఇదే అదనుగా భావించి సంతోష్ వర్మ, గీతావర్మపై గొడ్డలితో దాడి చేశాడు. అతి దారుణంగా, విచక్షణారహితంగా నరకడంతో గీతావర్మ అక్కడికక్కడే మరణించింది. కాగా సంతోష్ వర్మ తన తల్లి బాధ్యతలు చూసుకోవడానికి నిరాకరించడంతో గీతావర్మనే తన తల్లిని చూసుకుంటోందని స్థానికులు తెలిపారు.