కేసీఆర్‌ది పైశాచిక ఆనందం

 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ అంశం మీద టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డి లాంటివాళ్ళని పార్టీలో చేర్చుకుని కేసీఆర్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. టీడీపీ నుంచి ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేదీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, ఏపీ కృష్ణపట్నం విద్యుత్ యూనిట్ ఆరు రూపాయలకు ఇస్తానంటే దాన్ని తీసుకోకుండా లాంకో రాజగోపాల్ దగ్గర యూనిట్ 10 రూపాయలకు కొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. లాంకో సంస్థకు మేలు చేయడం కోసమే కృష్ణపట్నం విద్యుత్‌ని కేసీఆర్ తిరస్కరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని ‘యాదద్రి’గా మార్చడం మీద కూడా కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో సింహాద్రి, వేదాద్రి అని పిలుస్తారని, ఆ సంస్కృతిని తెలంగాణకు తేవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది తెలంగాణ సంస్కృతిని కించపరచడమేనని అన్నారు. యాదగిరి గుట్టకు సంబంధించిన సలహాలను ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన జీయర్ స్వామిని అడిగి తీసుకోవడం ఎందుకని? కొడంగల్‌కి చెందిన వేద పండితులు సుందర వరదాచార్యులును ఎందుకు వద్దనుకున్నారని ప్రశ్నించారు.