రాజధానిలో పురాతన వస్తువుల మాఫియా
posted on Nov 1, 2012 8:16AM
.png)
"font-size: larger;">రాష్ట్ర రాజధాని ట్విన్‌సిటీస్ కేంద్రంగా పురాతన వస్తువుల దందా సాగుతోంది. ఇక్కడి దందాను చూస్తే ముంబయ్, చెన్నయ్ వంటి నగరాలు కూడా ఎందుకూ పనికి రావన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆ నగరాలను తలదన్నే మాఫియాగ్యాంగులు ఇక్కడ దందా సాగిస్తున్నాయని పోలీసులకు సమాచారం అందుతోంది.
నేరానికి రేటు కట్టే మాఫియా ఇటీవల తన రూటు మార్చుకుని పురాతన వస్తువుల ఖరీదు పెంచుతోంది. అంతర్జాతీయంగా ఉన్న తమ సంబంధాలను పదిలం చేసుకుంటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దొంగలకు మాఫియా ఆహ్వానం పలుకుతోంది. ఐదు రూపాయల నోటుకు 50రూపాయలు చెల్లిస్తున్న మాఫియా ఆదేశాలు దొంగలు వరంగా మారుతున్నాయ్.
నిజాం నవాబుల కాలంలో ఉన్న గుళ్లలో ఉన్న పంచలోహవిగ్రహాలపై కన్నేశారు. విదేశీయులు పురాతన వస్తువులకు కొన్ని శక్తులుంటాయన్న నమ్మకంతో మాఫియా నుంచి ఆభరణాలు, పురాతన వస్తువులు కూడా కొనుగోళ్లు చేస్తున్నారట. రియల్‌ఎస్టేట్ పేరిట మాఫియా దందాలో చాలామంది నిమగ్నమయ్యారని తెలుస్తోంది.
తాజాగా 12ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారంటే ఇంకా ఎన్ని ముఠాలు ఈ రెండు నగరాల్లో ఉన్నారో? ఈ ఏడాది అక్టోబర్ వరకూ ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటికి 27 ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాజాగా జరిగిన లాల్‌దర్వాజాలోని మహంకాళి ఆలయం, గొల్నాకలోని నల్లపోచమ్మ, ఉప్పుగూడలోని రెండు ఆలయాల్లో దొంగతనాలు ముఠాల పనితీరుకు అద్దం పడుతున్నాయి. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా తెలివిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ప్రత్యేకించి స్టువర్టుపురం దొంగలు కూడా వీటిలో నిమగ్నమై ఉండవచ్చని అనుమానాలున్నాయి. చోరీ సొత్తును ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. అక్కడ తమ వారికి చెప్పి మాఫియా ఆ వస్తువులను సొంతం చేసుకుంటోంది. పోలీసుయంత్రాంగం దీనిపై దృష్టిసారించి పురాతన వస్తువులను, ఆభరణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.