పాలడుగు వ్యాఖ్యలు కొంచెం కరెక్టే అనిపిస్తోందా?
posted on Nov 1, 2012 8:12AM
.png)
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు ఊరికే ఒకరిపై నింద వేయరన్న నమ్మకం రాజకీయపరిశీలకులకు ఉంది. ఎందుకంటే హూందా అయిన రాజకీయతత్వాన్ని పాలడుగు ప్రతిబింబింపజేస్తారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్య రాష్ట్రం మొత్తం ఆలోచించేలా ఉంది. వైకాపాలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలంతా నీతినిజాయితీ లేనోళ్లే అని ఆయన తేల్చేశారు. అసలు ఈ మాట అందామనుకుని కూడా కాంగ్రెస్‌లో ఎందరో పెద్దలు వెనుకడుగు వేశారు. కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ పార్టీలోనే జీవించారన్న భావన వారికి అడ్డువచ్చింది. పాలడుగు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారనటానికి ఇంకో తాజా ఉదాహరణ ఇది. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారం కట్టబెడితే ప్రలోభాలకు లోనై తమ తమ సొంతపార్టీలను వైకాపా కోసం నట్టేట ముంచుతున్నారని పాలడుగు ధ్వజమెత్తారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నీతి నిజాయితీ లేని వారికి టిక్కెట్లు ఇవ్వటం వల్లే ఈ దారుణస్థితి వచ్చిందని తేల్చారు. రాజకీయాల్లో కనీస విలువలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆశలను వమ్ము చేసిన ఈ వైకాపా నేతలందరూ ప్రజలకు వివరణ ఇవ్వాలని పాలడుగు డిమాండు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యల్లో కొసమెరుపు నిజానికి బంధుత్వం అడ్డురాదన్నట్లుంది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందేనని పాలడుగు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాలు విన్న వారందరూ పాలడుగు బాగా కరెక్టుగా మాట్లాడారేమిటీ అంటున్నారు.