సత్యసాయి బాబా జీవిత ప్రస్థానం

పుట్టపర్తి: సత్యనారాయణరాజు అలియాస్ సత్యసాయి బాబా. 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతకు అవే మోగాయనీ ఇప్పటికీ చెప్పుకుంటారు. ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రచించిన జీవిత కథ ప్రకారం వ్రతం తర్వాత ఈశ్వరమ్మకు ఒక నీలిరంగు గోళం వంటి కాంతి తనలో లీనమౌతున్నట్లుగా కల వచ్చింది. తరువాత ఆమె గర్భవతి అయ్యింది. బిడ్డ జననం తరువాత పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చింది. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. అయితే ఈ అనుభవాలను గురించి ఆ సమయంలో ఉన్న వ్యక్తుల నుండే విభిన్న కథనాలు వినబడుతున్నాయి.

యౌవ్వనంలో సత్యసాయిబాబా దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయస్సులోనే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు. తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. మార్చి కొంత విచిత్రమైన ప్రవర్తన (తేలు కుట్టినట్లుగా) కనబరచాడు. ఈ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగినట్టు చెప్పుకుంటారు. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు. 1940లో తాను షిరిడీ సాయిబాబా చెందిన ఫకీరు అవతారమని ప్రకటించుకున్నాడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు. కస్తూరి వ్రాసిన జీవిత చరిత్ర ప్రకారం అక్టోబర్ 20, 1940లో, తన 14 యేండ్ల వయస్సు ఉన్నపుడు తన పుస్తకాలు వదిలేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పారు. తర్వాత మూడేండ్లు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటినుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూలు రికార్డులలో అతని పేరు ఉంది.

1944లో అనుచరులు (భక్తులు) ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని "పాత మందిరం" అంటారు. ప్రస్తుతం ఇది ఆశ్రమమైన ప్రశాంతి నిలయం. దీని నిర్మాణం 1948లో మొదలయ్యింది. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు శక్తిగల అవతారమని ప్రకటించాడు. ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు. 1958లో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారధి అధికారిక పత్రికను ప్రచురిచడం ప్రారంభించారు. అదేసమయంలో పలు పాశ్చాత్య దేశాల నుంచి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించడం అధికమైంది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారతదేశం దాటి బయటకు వెళ్ళాడు. కాని అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. 1960లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలు ఉంటానని చెప్పాడు. ప్రచురింపబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది."నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను గాని ఈ క్రొత్త శరీరంలో అలా కాను."

పుట్టపర్తే సత్యసాయి ప్రీతిపాత్రమైన స్థలం. పుట్టపర్తిలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నాడు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల (దీని డిజైనుకు పలు అవార్డులు లభించాయి). ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక రైల్వే స్టేషను, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి. పుట్టపర్తి ఆశ్రమాన్ని దేశ విదేశాలకు చెందిన వీవీఐపీలు దర్శించుకున్నారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి 10 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం నుంచి, 180 ఇతర దేశాల నుంచి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉంటుంది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరులోని "బృందావనం" ఆశ్రమంలో గడుపుతాడు. ఎప్పుడైనా కొడైకెనాల్ ‌లోని "సాయి శృతి ఆశ్రమానికి వెళతాడు.

సత్యసాయిబాబా మూడు ముఖ్య మందిరాలను స్థాపించాడు - అవి ముంబైలోని "ధర్మక్షేత్రం" లేదా "సత్యం", హైదరాబాదులోని "శివం", చెన్నైలోని "సుందరం". బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓంకార స్మరణ, సుప్రభాతాలతో మొదలవుతుంది. తర్వాత వేద పారాయణ సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబా దర్శనం ఇస్తాడు. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు మాసాలలో బాబా ఇచ్చే దర్శనం పట్ల భక్తులకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఎందుకంటే బాబా జన్మదినం ఈ కాలంలోనే వస్తుంది. దర్శన సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరిస్తాడు. విభూతిని 'సృష్టించి' పంచుతాడు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతిస్తాడు. ఇలా ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోష కారణంగా ఉంటుంది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులోని మాటలను, ఇతర అనూహ్యమైన విషయాలను వెల్లడిస్తుంటాడని అలా భక్తులు ఆశ్చర్యపడుతారని అంటారు.