తెలంగాణలో కలకలం.. మంత్రి జగదీశ్‌ రెడ్డి హత్యకు రెక్కీ.!!

 

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి హత్యకు రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. సుమారు 20 రోజుల క్రితం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఓ వాహనంలో మంత్రి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నాగారం వచ్చినట్టు తెలుస్తోంది.. అంతేకాకుండా వారు డ్రోన్‌తో గ్రామ వీధులు, డొంక రోడ్లను చిత్రీకరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.. రెక్కీ నిర్వహించినది ప్రగతి నివేదన సభ జరిగిన సెప్టెంబర్ 2న అని కొందరు, ఆగస్టు 30న అని మరికొందరు గ్రామస్థులు చెబుతున్నారు.. ఆగస్టు 30న అయితే జగదీశ్‌ రెడ్డి ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి నాగారం వెళ్లారు.. ఆయన నాగారంలో సెక్యూరిటీ లేకుండానే గ్రామస్తులతో కలిసిపోతారు.. సన్నిహితుల ఇళ్లకు, పొలం వద్దకూ వెళుతుంటారు.. ఇలాంటి సందర్భంలోనే దాడి చేయాలని పన్నాగం పన్నినట్లు సమాచారం.. రెక్కీ నిర్వహించినట్లు సమాచారం ఉందని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు కూడా చెప్పారు.. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.. జగదీశ్‌ రెడ్డికి గతంలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది.. ఏడాది క్రితం ఆయన సూర్యాపేటకు వస్తుండగా ఎర్రసానిగూడెం వద్ద హఠాత్తుగా ఓ వ్యాన్‌ కాన్వాయ్‌లోకి వచ్చి ప్రోటోకాల్‌ వాహనాన్ని ఢీకొట్టింది.. అనంతరం అది కనిపించకుండా పోయింది.