రైల్వే పరీక్ష... మాస్ కాపీయింగ్ మాఫియా...

 

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కి సంబంధించి నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. మాస్ కాపీయింగ్‌కి ప్రధాన కారణమైన మశ్చేందర్ కోసం స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్ఓ) పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మశ్చేందర్‌తో పాటు దీనికి సహకరించిన ఓ రైల్వే ఉద్యోగి కోసం కూడా ప్రత్యేక బలగాలు గాలింపు చేపట్టాయి. మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌లో ఈ ముఠా ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కంట్రోల్ రూంపై ఎస్‌వోటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు ఆదివారం దాడి చేసి 20 మందిని పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రదేశాలతోపాటు విజయవాడ, తిరుపతిలోని 10 పరీక్ష కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసి  పదిమంది కాపీరాయుళ్ళను అరెస్టు చేశారు. అయితే నాందేడ్‌లో కూడా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఎస్ఓటీ పోలీసులు చెబుతున్నారు. నిందితులు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రాలుగా ఎంచుకుని మాస్ కాపీయింగ్ దిగినట్లు తెలుస్తోంది.