నా శాపం వల్లే చచ్చాడు.. అమరవీరుడిపై బీజేపీ నేత వ్యాఖ్యలు

 

ఎన్నికల వేళ పలువురు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇటీవల బీజేపీలో చేరిన సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేరిపోయారు. భోపాల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రగ్యా సింగ్ ఠాకూర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్‌ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్‌ 26/11 ముంబై దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అతని సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఆయనకు అశోక్‌చక్ర అవార్డు లభించింది. అలాంటి  అమరవీరుడిపై ప్రగ్యా సింగ్ ఠాకూర్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను ఆయన తీవ్రంగా వేధించారు. దీంతో నేను ఆయన్ని శపించాను. అప్పటి నుంచి ఆయనకు అశుభ ఘడియలు మొదలయ్యాయి. అనంతరం ఆయన ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు’ అని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు.

2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఒకరు. దీనిపై విచారణ చేపట్టిన హేమంత్‌ కర్కరే.. పేలుళ్లలో వాడిన ద్విచక్రవాహనం ప్రగ్యా సింగ్ ఠాకూర్ పేరు మీదే నమోదై ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. 2016లో ఆమెకు ఎన్‌ఐఏ క్లీన్‌ చిట్ ఇచ్చినప్పటికీ కేసును కొట్టి వేయడానికి కోర్టు మాత్రం అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమె భోపాల్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రగ్యా సింగ్ ఠాకూర్‌పై ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన అశోక చక్ర అవార్డు గ్రహీత అయిన హేమంత్ కర్కరేపై సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఐపీఎస్ అసోసియేషన్ ఖండించింది. హేమంత్ కర్కరే తీవ్రదాదులతో పోరాడి వీరమరణం పొందారు. ఆయనపై ఈ అవమానకరమైన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ప్రాణాలు త్యాగం చేసి వీరమరణం పొందిన మావాళ్లను అందరినీ గౌరవించాలని ఐపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.