కరెంటు ఉంటేనే కాపురానికొస్తా...
posted on Apr 4, 2015 4:48PM
అత్త కష్టాలు పెడుతోందని కోడలు పుట్టింటికి వెళ్లడం చూశాం. కానీ ఈ కోడలు వెరైటీగా కరెంటు లేదని, కరెంటు కోతలు ఉన్నంతకాలం కాపురానికి రానని మొండికేసుకొని కూర్చుంది. పాట్నా జిల్లాలోని బార్ని గ్రామానికి చెందిన శశిభూషణ్ పాశ్వాన్ కి రేణు పాశ్వాన్ అనే యువతితో మూడేళ్ల క్రిందట పెళ్లి జరిగింది. అయితే రేణు పాశ్వాన్ కు అత్తింట్లో కరెంటు కోతలు ఎక్కువగా ఉండటం వలన, ఉక్కపోతలకు తట్టుకోలేక పోయింది. దీంతో పుట్టింటికి వెళ్లిపోదామని చూస్తున్న రేణు తన తొలిచూలు పేరుమీద పుట్టింటికి వెళ్లి పోయింది. కొడుకు పుట్టాక అత్తింటికి రావడానికి నిరాకరించింది. భర్త, బంధువులు ఎంత చెప్పినా వినక, కరెంటు కోత ఉండే ఆ ఊర్లో తాను ఒక్కరోజు కూడా ఉండలేనని చెప్పింది. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఇక ఆమెకు నచ్చచెప్పడం సాధ్యంకాదని భావించిన భర్త శశిభూషణ్ ధనుర్వా పోలీసు స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు భార్యాభర్తల వాదనలు విన్నారు. వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించి పోలీసులు కూడా విఫలమయ్యారు. మీ తగాదా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రే తీర్చాలి. మావల్ల కాదు అంటూ పోలీసులు చేతులు ఎత్తేశారు.