డబ్బుతోనే సంక్షేమం వస్తుందా!


కొన్నాళ్లుగా ఏ రోజు వార్తాపత్రికని చూసినా కూడా ప్రభుత్వం ఫలానా వర్గానికి మేలు జరిగేలా ఫలానా నగదు పథకాన్ని ప్రారంభించనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆఖరికి ప్రజలందరికీ కూడా నెలనెలా ఉచితంగా ఎంతో కొంత డబ్బుని ఇచ్చే ప్రతిపాదనని కూడా కేంద్ర పరిశీలిస్తోందనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఇలా డబ్బులు పంచేయడం వల్ల ఎవరి జీవితాలూ కూడా మెరుగుపడలేదనీ, పైగా ప్రతి విషయానికీ ప్రజలు ప్రభుత్వం వైపు దృష్టి సారించాల్సిన దుస్థితి ఏర్పుడుతుందన్న విమర్శలు ఉన్నాయి. కాకపోతే వీటిని పట్టించుకునేవారే కరువయ్యారు. పైగా ఏదన్నా పథకాన్ని విమర్శిస్తే, సదరు వ్యక్తి సంక్షేమానికే వ్యతిరేకి అన్న అపవాదు ఎలాగూ తప్పడం లేదు. దాంతో సంక్షేమ పథకాలకు అడ్డూ అదుపూ ఉండాలని గొంతు విప్పేవారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.


నిజంగానే డబ్బుని పంచడం వల్ల, విపరీతంగా రాయితీలను అందించడం వల్లనో, ఉచితంగా వస్తువులను ఇచ్చేయడం వల్లనో సంక్షేమం వస్తుందంటే దానిని కాదనే ధైర్యం ఎవరికీ ఉండదు. కానీ కొన్ని వర్గాల ఓట్లను దృష్టిలో ఉంచుకునో, ప్రజల సానుభూతిని పొందేందుకో, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకో పార్టీలు ఇలాంటి వరాలను కురిపించడం మాత్రం బాధాకరమైన విషయం. పైగా అటుతరిగీ ఇటుతిరిగీ ఇలాంటి పథకాలకు కావల్సిన నిధులను, మధ్యతరగతి ప్రజల పన్నుల నుంచే వసూలు కావడం ఆ వర్గాన్ని నిస్తేజపరిచేసే అంశం. ఈ దేశంలో డబ్బున్నవాడు హాయిగా బతికేస్తాడు, పేదవాడు సంక్షేమ పథకాలతో బతికేస్తాడు.... కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రమే త్రిశంకు స్వర్గంలో పాలుపోకుండా గడిపేస్తున్నాడు అన్నది ప్రతి ఇంట్లోనూ వినిపించే మాటే!


ఇంతకీ దేశంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే దానికి సామాజికవేత్తల నుంచి స్పష్టమైన జవాబులే వినిపిస్తాయి. రోటీ, కపడా, మకాన్ అనేది చాలా పాత నినాదం. నిజానికి ఒక వ్యక్తికి తిండి సంపాదించుకునే ఉద్యోగం, అనారోగ్యంలో తోడుగా వైద్య సదుపాయమూ, తన తలరాతని మార్చుకునేలా విద్యా సౌకర్యమూ ఉండాలి. ఒంటికి కప్పుకోవడానికి బట్టా, తలదాచుకోవడానికి ఏదో ఒక నివాసమూ చూపిస్తే మంచిదే! మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేలా శాశ్వతమైన పరిష్కారాలు చూపకుండా ఇవాల్టికి తిండి పెడతాము, ఉండటానికి ఇల్లు కట్టించి ఇస్తాము. నెలనెలా ఉచితంగా డబ్బులు ఇస్తాం అనే పథకాల వల్ల ఎవరో కొందరు మాత్రమే బాగుపడతారు.


మనిషి బతికేందుకు అవసరమయ్యే వైద్యం, మనిషి మనిషిలా బతికేందుకు అవసరమయ్యే విద్యారంగాలలో ప్రభుత్వం ఈనాటికీ దారుణమైన వైఫల్యాలను చవిచూస్తోంది. మనకి రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి పోయేందుకు భయపడుతున్నాం, మనకి చదువు కావాలంటే స్తోమతకి మించి అప్పులు చేసైనా సరే ప్రైవేటు కళాశాలల్లో విద్యని చెప్పిస్తాం. వర్షం కురవకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మారడం లేదు. వర్షం కురిస్తేనేమో నగరాలు చెరువులని తలపిస్తున్నాయి. తల్చుకుంటేనే కళ్లు బైర్లు కమ్మేలా ఇన్ని సమస్యలు మనల్ని వెన్నాడుతుంటే... వీటి మీద నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం మానేసి ఎవరో ఒకరికి నెలనెలా కాసిన డబ్బులిస్తానంటే, అవి కంటితుడుపు చర్యలు కాక మరేంటి!