సడెన్ గా భారత్-చైనా సరిహద్దులో ప్రత్యక్షమైన ప్రధాని మోదీ

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా.. లేహ్, లడఖ్‌లో ప్రధాని మోదీ ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఆయన వెంట త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు. ప్రధాని షెడ్యూల్ లో లేని ఈ పర్యటనకు ముందుగానే రహస్యంగా ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం లడఖ్ కు ప్రధాని వచ్చారని అక్కడి మీడియా వెల్లడించేంత వరకూ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు లడఖ్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. తొలుత ప్రత్యేక విమానంలో శుక్రవారం ఉదయం 10.00 గంటలకు లేహ్‌కు చేరుకున్న ప్రధాని.. సైనికులతో సమావేశమయ్యారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఐటీబీపీ జవాన్లు ఇందులో పాల్గొన్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని, పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గల్వాన్ లోయ ఘటన సహా సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని సమీక్షించనున్నారు. గల్వాన్ లోయ ఘర్షణలో గాయపడిన జవాన్లును కూడా ప్రధాని పరామర్శించనున్నారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. అక్కడ పరిస్థితిని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హఠాత్తుగా పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.